రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడి సమీపంలో ఆదివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఐదుగురు కారులో రాజమహేంద్రవరం వైపు నుంచి హైదరాబాదుకు వెళ్తున్నారు. వీరు ప్రయాణిస్తున్న కారు బాదంపూడి సమీపంలోని వెల్లమిల్లి రేవు వద్దకు వచ్చేసరికి కల్వర్టుపై నిర్మించిన రక్షణ గోడను వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు పక్కన కూర్చున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తిని హైవే అంబులెన్స్ వాహనంలో తణుకు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ జిల్లా కొంపల్లికి చెందిన వారు. మృతుల్లో ఇద్దరిని బొల్లా గిరి, ఎన్.ఖన్నాలుగా పోలీసులు గుర్తించారు. కారు డ్రైవర్ నిద్ర మత్తులోకి వెళ్లడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.
తిరుపతిలో ఇద్దరు యువకులు మృతి
చిత్తూరు(chittoor) జిల్లా తిరుపతి రూరల్ మండలం చెర్లోపల్లి-అలిపిరి బైపాస్ రోడ్డులో ఆగివున్న లారీని ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు చెర్లోపల్లి నుంచి అలిపిరి మార్గం వైపు వెళ్తున్నారు. రోడ్డు పక్కన ఆగివున్న లారీని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎం.ఆర్ పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: SAND PROBLEMS: మళ్లీ ఇసుక కష్టం..!