LEASE: చిత్తూరు గ్రామీణ మండలం 194బండపల్లె రెవెన్యూలోనిది.. బండపల్లె, వెంకటాపురం గ్రామాల్లోని పశువుల మేతకు ఇదే ఆధారం. గుట్టను చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సోదరుని కుమారుడి సంస్థకు ధారాదత్తం చేసేందుకు రెవెన్యూ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇక్కడి సర్వేనంబరు 83లో 143.13 ఎకరాల గుట్ట ఉండగా, అందులో 12.475 ఎకరాల్లో గ్రావెల్ తవ్వేందుకు అనుమతి కోసం చిత్తూరు తహసీల్దారు ఓ లేఖను ఇటీవల నగరపాలక సంస్థకు పంపగా.. జూన్ 1న జరిగిన కౌన్సిల్ సమావేశంలో అధికార పార్టీ కార్పొరేటర్ల అభ్యంతరాల నడుమ తీర్మానాన్ని ఆమోదించారు. 83 సర్వే నంబరులోనే 12.375 ఎకరాలు కావాలని మరో దరఖాస్తు చేయగా, దానికీ సరేనన్నారు. ఇక రెవెన్యూ ఎన్‌వోసీ, భూగర్భ గనులశాఖ అధికారుల ఆమోదమే మిగిలింది. ఎమ్మెల్యేకు చెందిన జేఎంసీ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ సైతం నరిగపల్లెలోని సర్వే నంబరు 1లో 17.95 ఎకరాలు, ఇదే నంబరులో మరో 24.9 ఎకరాల్లో గ్రావెల్/ మొరం తవ్వుకోవడానికి నాలుగు దరఖాస్తులు ఇచ్చింది. మాపాక్షిలో సర్వే నంబరు 60లో 7.48 ఎకరాలకు ఒకటి, 7.82 ఎకరాలకు మరో దరఖాస్తు ఎమ్మెల్యే సంస్థ నుంచి రాగా.. వాటికీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. మొత్తం 83 ఎకరాలను చిత్తూరు ఎమ్మెల్యే, ఆయన సోదరుని కుమారుడి సంస్థలకు లీజు పేరిట అప్పగించాలని కౌన్సిల్ తీర్మానించింది.
రెండు ఎక్స్‌ప్రెస్ వేలు వస్తున్నాయని...
జిల్లాలో చిత్తూరు-తచ్చూరు, బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్ వేల నిర్మాణం త్వరలో జరగనుంది. రహదారుల నిర్మాణానికి అవసరమైన గ్రావెల్, మొరంను గుట్ట, ప్రభుత్వ భూముల నుంచి తవ్వి తరలించాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నిర్ణయించారు. అందులో భాగంగానే 83 ఎకరాల భూముల్లో లీజు ప్రాతిపదికన గ్రావెల్ తవ్వకాలకు దరఖాస్తు చేశారు.
గ్రావెల్ క్వారీలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ వచ్చిన దరఖాస్తులు ఉన్నతాధికారుల వద్ద ఉన్నాయి. వారు ఆమోదం తెలిపితేనే క్వారీలకు ఆమోదం లభిస్తుంది.
రేణుక, ఆర్డీవో, చిత్తూరు
ఇవీ చదవండి: