కరోనా రెండో దశ వ్యాప్తి చిత్తూరు జిల్లాపై పంజా విసురుతోంది. మొదటి దశలో గతేడాది జిల్లాలో మొత్తం 88వేల 617 కేసులు నమోదైతే.. రెండో దశ వ్యాప్తిలో ఒక్క నెలలోనే వాటిని మించి కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో 35 మండలాల్లో 10 శాతానికి మించి పాజిటివిటీ రేటు నమోదు కాగా.. మే నెలలో రికార్డు స్థాయిలో 66 మండలాల్లోనూ పాజిటివిటీ రేటు పదిశాతాన్ని దాటిపోయింది.
చిత్తూరు జిల్లాపై కరోనా రెండో దశ ప్రభావం ఏ స్థాయిలో ఉందో ఈ గణాంకాలే చెబుతున్నాయి. కొవిడ్ కేసుల పెరుగుదలతో.. స్విమ్స్, రుయా ఆసుపత్రులపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. ఆస్పత్రుల్లో పడకలు సరిపోకపోవటంతో అధికార యంత్రాగం అప్రమత్తమైంది.
శనివారం జరిగిన కొవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో.. జిల్లాలో కొవిడ్ వ్యాప్తి తీవ్రతపై మంత్రుల ఎదుట అధికారులు ప్రస్తావనకు తీసుకువచ్చారు. అధికారులతో సమీక్షించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి... ప్రభుత్వం ఆదేశాల మేరకు జూన్ 1 నుంచి లాక్ డౌన్ ఆంక్షలను మరింత కట్టుదిట్టం చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటివరకూ ఉదయం 6 నుంచి 12 గంటల వరకూ కర్ఫ్యూ కాగా.. జూన్ 1 నుంచి ఉదయం 6 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకే... నిత్యావసరాల కొనుగోలుకు అవకాశం కల్పించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి.. ఆ ప్రాంతాల్లో వైరస్ కట్టడి చేసేలా అధికారులు సిద్ధమవుతున్నారు. మహమ్మారిని నియంత్రించేందుకు ప్రజలు సైతం సహకరించాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: