తమిళనాడుకు సమీపంలో ఉన్న చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గాన్ని నివర్ తుపాన్ భారీగా ప్రభావితం చేసింది. నిన్న ఉదయం నుంచి ఈరోజు వరకు కురిసిన వర్షానికి.. వరదనీరు రోడ్లపై పోటెత్తింది. వరదయ్యపాలెం నుంచి కాళహస్తికి వెళ్లే ప్రధాన మార్గం జలమయమైంది. నాగలాపురం, పీవీపురం సమీపంలోని గొడ్డేరు, రాళ్లవాగు గుండా వరదనీరు ప్రవహిస్తోంది. తవణంపల్లి, యాదమరి, బంగారుపాలెం, ఐరాల, పూతలపట్టు మండలాల్లో.. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. అధికారులు ఎప్పటికప్పుడు గ్రామాల్లో పర్యటించి.. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
నారాయణవనం మండలంలోని పాలమంగలం వద్ద అరుణానది ఉద్ధృతి ఎక్కువగా ఉండగా.. 4 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. సత్యవేడు, బుచ్చినాయుడు కండ్రిగ మండలాల్లో గాలి బీభత్సవానికి చెట్లు విరిగి కరెంటు తీగలపై పడి.. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరించడంతో.. కొంతవరకు ఉపశమనం కలుగుతోంది. సత్యవేడు నియోజకవర్గంలోని ఏడు మండలాల పరిధిలో సుమారు 950 ఎకరాలకు పైగా.. వరి, వేరుశనగ పంటలు నీటమునిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి:
ఏర్పేడు: వరద నీటిలో చిక్కుకున్న ముగ్గురు రైతుల్లో.. ఒకరు గల్లంతు