కరోనా బాధితులకు ఇప్పటి వరకు అందిస్తున్న వైద్య సేవల కన్నా మెరుగ్గా కార్పొరేట్ తరహాలో వైద్య సేవలు అందించాలని ప్రభుత్వ విప్, తుడా చైర్మెన్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా వైద్యాధికారులకు సూచించారు. శుక్రవారం రాత్రి శిల్పారామం(అర్బన్ హాట్) లో చెవిరెడ్డి... జిల్లా వైద్యాధికారులతో వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
ఎక్కడా రాజీ పడొద్దు..
రానున్న రోజులు అత్యంత కీలకమని...కరోనా కేసులు మరిన్ని పెరిగే అవకాశం ఉందని చెవిరెడ్డి అన్నారు. అందుకు అనుగుణంగా వైద్య సేవలు అందించేందుకు సంసిద్ధం కావాలని వైద్యులకు సూచించారు. సౌకర్యాల కల్పనలో ఎక్కడా రాజీ పడరాదని తెలియజేశారు. జిల్లా కలెక్టర్‌తో పాటు వివిధ శాఖల సమన్వయంతో కరోనా బాధితులకు అందిస్తున్న సేవలు రాష్ట్ర స్థాయిలో స్ఫూర్తిగా నిలుస్తున్నాయని తెలిపారు. మున్ముందు ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తారని ఆకాంక్షించారు.
అనంతరం జిల్లా కొవిడ్ ఆసుపత్రులు, క్వారంటైన్ కేంద్రాల వారీగా సౌకర్యాల పై ఆరా తీశారు. కార్పొరేట్ తరహా వైద్య సేవల కల్పనకు కావాల్సిన సదుపాయాలు తెలియజేయాలని సూచించారు. ఏదైనా కేంద్రంలో లోటుపాట్లు, ఫిర్యాదులు ఉంటే వెంటనే పరిష్కరించాలన్నారు.
ఇదీ చదవండి..దారుణం: పసికందును వదిలి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు