విరసం నేత వరవరరావును విడుదల చేయాలని ఎందరో మేధావులు, రచయితలు బహిరంగ లేఖలు రాశారని, వారందరినీ దేశం నుంచి బహిష్కరించాలని కోరడం న్యాయమా అని వైకాపా ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ప్రశ్నించారు. ధర్మం, న్యాయం వైపు నిలబడటం నేరమైతే ఆ పని తాను నిరంతరం చేస్తూనే ఉంటానన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న 81 ఏళ్ల వృద్ధుడిపై జాలి చూపించడం నేరమని భావిస్తే ఏం చెప్పాలని ప్రశ్నించారు. వరవరరావును విడుదల చేయాలని ఉపరాష్ట్రపతికి తాను లేఖ రాయడంపై సీఎం జగన్ చర్యలు తీసుకోవాలంటూ భాజపా రాష్ట్ర సహ ఇన్‌ఛార్జ్ సునీల్ దేవ్‌ధర్ చేసిన వ్యాఖ్యలపై భూమన స్పందిస్తూ లేఖ రాశారు.
46 ఏళ్ల క్రితం నేను, ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, వరవరరావు కలిసి జైలులో ఉన్నాం కాబట్టే ఉపరాష్ట్రపతికి వ్యక్తిగతంగా లేఖ రాశాను. ప్రధాని హత్యకు కుట్రపన్నిన వ్యక్తిని సమర్థించడం నా ఉద్దేశం కాదు. ప్రధానిపై నాకు అపార గౌరవం, అభిమానం ఉన్నాయి. అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధుడి పట్ల జాలి చూపించమని కోరాను. అంతమాత్రాన నేను వరవరరావు భావజాలాన్ని అంగీకరించినట్లు కాదు. నేను యువకుడిగా రాడికల్ భావాలున్న వ్యక్తిగానే ప్రచారం జరిగింది. కానీ నా రాజకీయ జీవితం ఆరెస్సెస్ భావజాలంతోనే ప్రారంభమైందన్న విషయం కొందరికే తెలుసు. నా వ్యక్తిగత అభిప్రాయానికి, ముఖ్యమంత్రితో ముడిపెడుతూ ట్విటర్‌లో వ్యాఖ్యలు చేయడం బాధ కలిగించింది’’
- ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి
ఇదీ చూడండి. కుట్రపన్నిన వ్యక్తిని సమర్థించడం నా ఉద్దేశం కాదు: ఎమ్మెల్యే భూమన