Mileru Festival in Andhra: రాష్ట్రంలో ఆ క్రీడను నిషేధించారు. అయినప్పటికీ అధికార పార్టీ నేతల కనుసన్నల్లో మైలేరు పండగ పేరుతో ఆటను నిర్వహిస్తూనే ఉన్నారు. నిర్వహించడం ఒక ఎత్తైతే అందులో విజేతలకు బహుమతుల ప్రకటన మరో ఎత్తు. ఇవన్నీ ఇలా ఉండగా ఆ ఆటలో పాల్గొన్న 51వ విజేతకు ఒక నాటుకోడి, ఫుల్‌బాటిల్ బహుమతిగా అందిస్తామని పాంప్లెట్పై ముద్రించి ప్రచారం చేయడం విడ్డూరంగా మారింది.
రాష్ట్రంలో నిషేధం విధించిన మైలేరు పండగ పోటీలను చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండలంలో సంక్రాంతి సందర్భంగా మైలేరు పండగ నిర్వహిస్తున్నారు. మైలేరు పండగ, జల్లికట్టు వంటి పోటీలు నిషేధం ఉన్నప్పటికీ స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల అండదండలతోనే ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. జోరుగా సాగుతున్న ఈ ఆటలకు వేల రూపాయల్లో ప్రవేశ రూసుం వసూలు చేస్తున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు.
ఆవు పేడను విసురుకుంటూ పండగ- చొక్కాలు విప్పి ఒకరిపై ఒకరు!
ఈ పోటీలకు సంబంధించిన వివరాలను సామాజిక మాధ్యమాల్లో ఇతరులకు పంచుకుంటూ, వాటికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, వైఎస్సార్సీపీ నాయకులు ఫోటోలు జోడిస్తున్నారు. ఈ నెల 21న బైరెడ్డిపల్లె మండలం కూటాలవంకలో మైలేరు పండగ పేరుతో పోటీలకు సంబంధించిన ఫోటోల ప్రచారం సామాజిక మాధ్యమాల్లో జోరుగా సాగుతోంది. ఈ పోటీల్లో పాల్గొని విజయం సాధించిన వారికి బహుమతులు ప్రధానం చేస్తున్నట్లు ఆ ఫోటోల్లో ఉంది.
ఇందులో 51 బహుమతులు ఉండగా 50 బహుమతుల వరకు నగదు, వస్తువులను ఇవ్వనున్నట్లు ఆ ఫోటోల్లో ఉంది. 51వ బహుమతిగా నాటుకోడి, ఫుల్‌బాటిల్ ప్రధానం చేయనున్నట్లు ముద్రించారు. మధ్యపాన నిషేధం అంటూ చెప్పిన ముఖ్యమంత్రి ఫోటోలను ముద్రించి, ఫుల్‌బాటిల్ బహుమతి అంటూ ప్రచారం చేయడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ నేతల మద్యపాన ప్రోత్సాహకానికి ఇదే పరాకాష్ట అని ప్రజలు విమర్శిస్తున్నారు.
దేవుడి ప్రసాదాలు లూటీ- అలా చేస్తే సమస్త రోగాలు మాయం! 350 ఏళ్లుగా ఇదే ఆచారం
మైలేరు పండగ అంటే : తెలుగు ప్రజలకు సంక్రాంతి పండగ అంటే ఎంతో ప్రత్యేకం. సంవత్సర కాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో జరుపుకునే పండగ కాబట్టి రైతులకు మరింత ప్రీతికరమైనది. మైలేరు పండగను కనుమ రోజున పూర్వం రైతులు నిర్వహించుకునేవారు. సంవత్సరం పోడవున కష్టపడే కాడెద్దులను, పశుసంపదను రైతులు శుభ్రపరచేవారు. ఆ తర్వాత వాటిని అందంగా పుష్పాలతో అలంకరించేవారు.
అలంకరించిన ఎద్దులకు గ్రామదేవతల ఆలయాల వద్ద భక్తి శ్రద్ధలతో పూజించేవారు. ఆందంగా ఆలంకరించిన ఎద్దుల యాజమానులకు గ్రామ పెద్దలు ఆనాటి కాలంలో ప్రోత్సాహకంగా బహుమతులు ప్రధానం చేసేవారు. అయితే కొందరు నేడు దానికి సరికొత్త విధానంగా మార్చి సంప్రదాయ పండగను పోటీల పేరుతో వ్యాపారంగా మార్చివేశారు.
గిరిజనుల మట్టి పండగ.. వరి ధాన్యానికి పూజ.. ఆ తర్వాతే వ్యవసాయ పనులు..