ఆయన దేశ సరిహద్దులలో పనిచేసే సైనికుడు.. ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ముగించుకుని సెలవుపై ఇంటికి వచ్చారు.. భార్యకు వైద్యం చేయించాలని పిల్లలను తన స్వగ్రామంలోని తల్లిదండ్రుల వద్ద వదిలి వెళ్లారు.. తిరిగి పిల్లలను తీసుకొని ఇంటికి వస్తుండగా లారీ రూపంలో మృత్యువు వెంటాడడంతో తండ్రితో పాటు కుమారుడు ప్రాణాలు విడిచారు. ఎస్సై తిప్పేస్వామి కథనం ప్రకారం... పీలేరు రెడ్డిరెడ్డి కాలనీలో నివాసముంటున్న సాంబశివనాయుడు(40) జమ్మూకశ్మీర్ సైనికుడిగా పనిచేస్తున్నారు. పది రోజుల కిందట సెలవుపై ఇంటికి వచ్చారు. గురువారం ఉదయం పిల్లలు ప్రణీత్(10), సాయి లోకేష్(8)లను స్వగ్రామమైన కలకడ మండలం బాటవారిపల్లెలోని తల్లిదండ్రుల వద్ద విడిచిపెట్టారు. భార్య సంపూర్ణకు వైద్యం చేయించడానికి కారులో బెంగళూరు వెళ్లి సాయంత్రం పీలేరుకు చేరుకున్నారు. ద్విచక్ర వాహనంలో స్వగ్రామం చేరుకొని పిల్లలను తీసుకొని రాత్రి పీలేరుకు వస్తుండగా వెంకటాద్రి ఇళ్ల సమీపంలో వెనుక నుంచి వచ్చిన లారీ వీరిని ఢీ కొనడంతో కిందపడిపోయారు. సాంబశివనాయుడు, ప్రణీత్‌లపై లారీ దూసుకెళ్లడంతో మృతి చెందారు. చిన్న కుమారుడు సాయి లోకేష్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
సాంబశివనాయుడు, ప్రణీత్ (పాతచిత్రాలు)
లే నాయనా..
పీలేరు ఆసుపత్రి వద్దకు చేరుకున్న సంపూర్ణ విగతజీవిగా ఉన్న కుమారుణ్ని చూసి గుండెలవిసేలా రోదించారు. ఇంటికి వస్తున్నామని చెప్పారే.. ఇంతలో ఏమైంది. నా బిడ్డ ఇలా కదలకుండా పడిపోయాడు. చిన్నబ్బాయి, భర్త ఎక్కడ ఉన్నారు.. చూపించండంటూ ఆమె విలపించడాన్ని చూపరులను సైతం కంట తడిపెట్టించింది. మృతదేహాలను మరణోత్తర పరీక్షల నిమిత్తం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి ఆసుపత్రి వద్దకు చేరుకుని మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఇదీ చదవండి: