కలియుగ ప్రత్యక్షదైవం..శ్రీనివాసుని సన్నిధిలో కార్తిక వనభోజన మహోత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం కోలాహలంగా నిర్వహించింది. శ్రీవారి ఆలయం నుంచి గజ వాహనంపై శ్రీవారు, మరో పల్లకీలో శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు పాపవినాశనం రహదారిలోని పార్వేట మండపానికి చేరుకున్నారు. మంగళ వాద్యాలు, మహిళల కోలాటాలు, భజన బృందాల నృత్యాల మధ్య స్వామి, అమ్మవార్ల ఊరేగింపు కన్నులపండువగా సాగింది.
సుందరంగా అలంకరించిన పార్వేట మండపంలో శ్రీదేవీ, భూదేవీ సమేత మలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనంను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మంగళవాద్యాలు, వేదమంత్రోచ్ఛరణల మద్య పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, సుగంధద్రవ్యాలతో ఉత్సవరులకు అభిషేకం చేశారు. ధూప, దీప నైవేద్యాలను సమర్పించారు. అన్నమయ్య కళాకారులచే భక్తి సంకీర్తనా కచేరీని నిర్వహించారు.
కొవిడ్-19 నిబంధనల మేరకు జాగ్రత్తలు తీసుకుంటూ వనభోజన మహోత్సవాన్ని నిర్వహించారు. తితిదే ఉన్నతాధికారులు, సిబ్బంది, పరిమిత సంఖ్యలో యాత్రికులు పాల్గొన్నారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న మహిళలు ఉసిరి చెట్టు కింద దీపారాధన చేశారు.
పార్వేట మండపం నుంచి తిరిగి స్వామివారు, అమ్మవార్లు ఊరేగింపుగా ఆలయానికి చేరుకోవటంతో వనభోజన మహోత్సవం ముగిసింది. వనభోజనోత్సవం కారణంగా రద్దు చేసిన ఆర్జిత సేవలు సోమవారం నుంచి పునరుద్ధరిస్తారు.
ఇదీ చదవండి: భారీ వర్షాలతో నష్టపోయిన రైతుల ఎదురుచూపు