ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో తిరుపతి, చిత్తూరు, మదనపల్లె రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. తిరుపతిలో 15, చిత్తూరులో 20 మండలాలు ఉన్నాయి. దేశంలోనే అతిపెద్ద రెవెన్యూ డివిజన్‌గా మదనపల్లె గుర్తింపు పొందింది. ఇందులో నాలుగు మున్సిపాలిటీలు, 31 మండలాలు ఉన్నాయి. రాష్ట్రంలోనే చిట్టచివరి నియోజకవర్గంగా ఉన్న కుప్పం, కర్ణాటక, అనంతపురం జిల్లాకు సరిహద్దుగా ఉన్న తంబళ్లపల్లె, చంద్రగిరి నియోజకవర్గంలోని ఎర్రావారిపాళెం వరకు ఈ డివిజన్ విస్తరించి ఉంది. పలమనేరు, పుంగనూరు, కుప్పం నియోజకవర్గాలను కలిపి నూతనంగా పలమనేరును రెవెన్యూ డివిజన్‌గా చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇందుకు ప్రతిపాదనలు రూపొందించి ఉన్నతాధికారులకు పంపినట్లు తెలుస్తోంది. ఆమోదం లభిస్తే.. మదనపల్లె డివిజన్ పరిధి తగ్గనుంది.
కుప్పం వాసులకు ప్రయోజనం
ప్రస్తుతం కుప్పం నియోజకవర్గ ప్రజలు రెవెన్యూ సమస్యల విషయమై మదనపల్లెకు వెళ్లాలంటే 120 కిలోమీటర్లు ప్రయాణించాలి. దీనికితోడు నేరుగా బస్సులు లేకపోవడంతో పలమనేరు వచ్ఛి.. అక్కడినుంచి మరో బస్సులో మదనపల్లెకు వెళ్లాల్సి వస్తోంది. ఇందుకు ఒక రోజు పడుతోంది. పలమనేరునే డివిజన్‌గా చేస్తే వారి కష్టాలు కొంతమేర తీరుతాయి.
శ్రీకాళహస్తి ప్రస్తావనకు వచ్చేనా?
శ్రీకాళహస్తి డివిజన్ చేయాలనే ప్రతిపాదన సైతం 2003-04 నుంచే ఉంది. గత ప్రభుత్వంలో ఇది మరోసారి తెరపైకి వచ్చింది. తమిళనాడును ఆనుకొని ఉన్న సత్యవేడు నియోజకవర్గ వాసులకు తిరుపతి కొంత దూరమే. శ్రీకాళహస్తి నియోజకవర్గం నెల్లూరు జిల్లా వెంకటగిరి వరకు విస్తరించి ఉంది. గ్రామాలు సైతం ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి. ఒక్క శ్రీకాళహస్తి మండలంలోనే 46 పంచాయతీలున్నాయి. ఈ నేపథ్యంలో సత్యవేడు, శ్రీకాళహస్తిని కలిపి రెవెన్యూ డివిజన్‌గా చేస్తే ప్రయోజనంగా ఉంటుందని ఆ ప్రాంత వాసులు భావిస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేసే తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్తి డివిజన్ ఏర్పాటు విషయమై ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.
ఇదీ చదవండి: తండ్రి కష్టం చూడలేక.. కాడెద్దులుగా మారిన కూతుళ్లు