కరోనా సమయంలో ఉపాధి పనుల్లో అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ఉపాధి హామీ పథకం ద్వారా పలమనేరు నియోజకవర్గం పరిధిలో వివిధ రకాల పనులను అధికారులు చేపడుతున్నారు. వాటిలో యంత్రాలతో పనులు చేసి బిల్లులు చేసుకుంటున్నవే ఎక్కువగా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల గంగవరం మండలంలో చేపట్టిన పనుల్లో అక్రమాలు ఎక్కువగా వెలుగు చూశాయి. ప్రభుత్వం కూలీలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో నిర్దేశించిన పనులను రాత్రి సమయాల్లో యంత్రాలతో చేయించి బిల్లులు చేసుకుంటున్నట్లు తెలిసింది. పాత గుంతల్లోని పాచిని పారలతో తొలగించి ఫిష్‌పాండులను తయారు చేసి కొత్తగా బిల్లులకు ప్రయత్నిస్తున్నారు. కొందరు నాయకుల అండదండలతో ఈ వ్యవహారం జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
నామమాత్రంగా సామాజిక తనిఖీలు
మండలంలోని తాళ్లపల్లె పంచాయతీ పరిధిలో ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ.కోటి విలువ చేసే పనులు జరిగాయి. ఇందులో అక్రంగా చేపట్టిన పనులు ఉన్నట్లు సమాచారం. మల్బరీ తోటలు లేకనే సాగు కోసం పనులు చేసినట్టు ఖాళీ వ్యవసాయ భూమిని చూపించారని తెలిసింది. మొక్కలు నాటడానికి ఎప్పుడో తవ్విన పాత గుంతలను కూడా చూపించి బిల్లులు చేసుకున్నట్లు తెలిసింది. పాత గుంతల అంచులను లోతుగా జేసీబీ యంత్రాలతో తవ్వేస్తారు. కుంట మధ్యలోని పాచిని పారతో చెక్కేసి కొత్త గుంతగా చూపిస్తారు. ఈ పనులకు సంబంధించి గతంలో నిర్వహించిన సామాజిక తనిఖీలు తూతూ మంత్రంగా చేపట్టడంతో అక్రమాలకు అవకాశాలు ఏర్పడుతోంది.
విచారణ జరిపిస్తాం
కొన్నిచోట్ల అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయి. దానికి సంబంధించిన మస్టర్లను కార్యాలయానికి తెప్పించాం. కొందరు సిబ్బందిని ప్రత్యేకంగా పంపి పనులపై విచారణ జరిపిస్తున్నాం. అక్రమాలు ఉన్నట్లు తెలిస్తే.. బిల్లులు చేయం. పాత వాటికి బిల్లులు చేసినట్లు తేలినా చర్యలు తప్పవు. - వరప్రసాద్, ఏపీడీ, పలమనేరు
ఇదీ చదవండి
ప్రాణవాయువు ఉంటేనే పడక