అటవీ బఫర్ జోన్ భూమిలో పేదలకు ఇళ్ల స్థలాల ప్రతిపాదనను హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. రిజర్వు అటవీ భూమిలోకి అధికారులు ఎలా ప్రవేశిస్తారని ప్రశ్నించింది. ఇళ్ల స్థలాల పేరుతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పింది.
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం రంగంపేట పంచాయతీ పరిధి నాగపట్ల గ్రామంలో అటవీ బఫర్ జోన్ భూమిలో యథాతథస్థితి పాటించాలని అధికారులను ఆదేశించింది. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ కృష్ణమోహన్ తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు.
నాగపట్ల గ్రామ సర్వేనంబరు 338లో రిజర్వు ఫారెస్ట్ బఫర్ జోన్ పరిధిలోకి వచ్చే బండిదారికి చెందిన భూమిలో.. ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అధికారులు యత్నిస్తున్నారని పేర్కొంటూ రాజశేఖర్ రెడ్డి, తదితరులు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున న్యాయవాది ప్రణతీ వాదనలు వినిపించారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం .. యథాతథ స్థితి పాటించాలని అధికారుల్ని ఆదేశించింది.
ఇదీ చదవండి: తగ్గని కరోనా ఉద్ధృతి.. 24 గంటల్లో 10,167 కేసులు నమోదు