నేటి యువతను ఎక్కువగా ఆకర్షిస్తున్న రంగాల్లో ఫొటోగ్రఫీ ఒకటి. సరదా కోసం కొందరు.. వృత్తిగా ఎంచుకుని మరికొందరు.. సమాజానికి ఏదో చెప్పాలనే తాపత్రయంతో ఇంకొందరు ఈ రంగంలోకి వస్తుంటారు. అలా సందేశాత్మకంగా ఫొటోలు తీయాలనుకునే వారిలో చిత్తూరు యువకుడు హనీష్ ఒకడు. ‘‘బ్లాక్ రిఫ్లెక్ట్స్ ఎవ్రీథింగ్’’ అనే నేపథ్యంతో యువతలో ఆలోచన కలిగించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇటీవలే డిగ్రీ పూర్తి చేసిన అతడికి ఫొటోగ్రఫీ అంటే ఆసక్తి. మొదట్లో మొబైళ్లు, చిన్నపాటి కెమెరాలతో ఫొటోలు తీసేవాడు. అయితే తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలన్న లక్ష్యంతో ఫైన్ ఆర్ట్స్‌ను ఎంచుకున్నాడు.
సమాజంలో జరిగే అనేక ఘటనలు, ఒత్తిడిలో కూరుకుపోయిన విద్యార్థులు, ఇక బతకలేమనుకున్న వారు, వేదనలు వంటివే హనీష్ ఫొటోగ్రఫీకి కథావస్తువులు. అలాంటి వారి మానసిక పరిస్థితుల తాలూకు ఆనవాళ్లను ఫొటోలుగా బంధిస్తూ, పరోక్షంగా సామాజిక స్పృహ కలిగిస్తున్నాడు. తన ప్రయత్నాలను సామజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నాడు. హనీష్ చిత్రాలకు కొందరు ఫిదా అవుతున్నారు. మరెందరికో అతడి చిత్రాలు కనువిప్పు కలిగిస్తున్నాయి.
ఫొటోగ్రఫీలో..ఫైన్ ఆర్ట్స్ వేరయా...!
చాలామంది తమలోని భావాలను బయటకు చెప్పలేకపోతుంటారు. ఫైన్ ఆర్ట్స్ ద్వారా ఆ భావాలను ప్రపంచానికి చూపించవచ్చు. మిగతా ఫొటోగ్రఫీలలో కెమెరా సాంకేతికతకు ఎక్కువ విలువ ఉంటుంది. కానీ ఫైన్ ఆర్ట్స్ వాటికి భిన్నమైంది. ఇందులో ముందుగానే ఒక నేపథ్యాన్ని ఎంచుకుంటారు. దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకుంటారు. మనుషుల అంతర్మథనాన్ని ఆవిష్కరించగల నేర్పు ఈ డార్క్ ఫొటోగ్రఫీ సొంతం. ఇందులోని ఫొటోలు ఎక్కువగా బ్లాక్ అండ్ వైట్‌లో ఉంటాయి. ఎందుకంటే కలర్‌లో ఉండే వాటికంటే వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సహజత్వం ఉట్టిపడుతున్నట్లుగా ఉంటాయి. వాటిని చూడగానే ఏదో భావనను కలుగచేస్తాయి.
ఇదీ చదవండి:
ఆదోనిలో సింపుల్‌గా పెళ్లి...విందు ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!