నాటు బాంబులు పేలి ఇద్దరు తీవ్రంగా గాయపడిన ఘటన చిత్తూరు జిల్లా వాల్మీకిపురం మండలం షికారిపాలెం అటవీ ప్రాంతంలో జరిగింది. వేటగాళ్లు అడవి జంతువులకు పెట్టిన నాటు బాంబుల వల్ల ప్రమాదం జరిగిందని సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కలకడ మండలం మొరంమీదపల్లెకు చెందిన వెంకటేశ్వర నాయుడు, కుమార్లు తప్పిపోయిన తమ గొర్రెలను వెతుకుతూ షికారిపాలెం సమీప అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. అక్కడ అడవి జంతువుల కోసం ఏర్పాటు చేసిన నాటు బాంబులు పేలటంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వారి వెంట వచ్చిన మూడు శునకాలు మృతి చెందాయి.
క్షతగాత్రులను 108 వాహనంలో వాల్మీకిపురం ప్రభుత్వాసుపత్రికి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.