చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవుల్లో ఏనుగుల గుంపులు సంచరిస్తున్నాయి. అటవీ సమీప గ్రామాల్లోని పొలాలను ధ్వంసం చేస్తున్నాయి. వేసవి రాకముందే గజరాజులు పంట పొలాల మీద పడుతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. దాదాపు 40 నుంచి 50 ఏనుగులు మూడు బృందాలుగా విడిపోయి రేణిగుంట మండలం, చంద్రగిరి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో దాడులు చేస్తున్నాయని చెప్పారు. ఇవి ఎక్కువగా కేపీ డ్యాం, అన్నదమ్ముల బండ, మామండూరు, బ్రహ్మదేవుని గుండం తదితర ప్రాంతాల్లోని సమీప గ్రామాల పొలాల్లో సంచరిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని ఆవేదన చెందారు. తాజాగా.. రేణిగుంట మండలంలోని మామండూరు అటవీ సమీపంలోని పొలాలపై 5 ఏనుగులు దాడులు చేశాయి. వాటిని అడవిలోనే ఉంచే విధంగా అటవీశాఖ అధికారులు కట్టడి చేసి తమను కాపాడాలని రైతులు కోరుతున్నారు.
ఇవీ చూడండి: