పంట పొలాలపై ఏనుగులు చేస్తున్న వరుస దాడులతో రైతులు హడలిపోతున్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం రామానాయుడుపల్లె సమీపంలో అరటి, మామిడి తోటలను ఏనుగులు ధ్వంసం చేశాయని సంబంధిత రైతులు అధికారులకు ఫిర్యాదు చేశారు.
శనివారం రాత్రి కొట్రకోన సమీపంలో అరటి తోటలను ధ్వంసం చేసిన ఏనుగులు.. చిత్తూరు మండల పరిధిలోకి చేరుకున్నాయి. అక్కడ పంట పొలాలపై దాడి చేసిన ఏనుగులు.. తిరుగు ముఖం పట్టటంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంతలోనే ఆదివారం రాత్రి గంగాధర మండలంలో అరటి తోటను ధ్వంసం చేయటంతో రైతులు లబోదిబోమంటున్నారు.
గతంలో ఎన్నడూ లేనివిధంగా తమ ప్రాంతంలో ఏనుగుల బెడద తీవ్రమైందని రైతులు వాపోతున్నారు. అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టి.. ఏనుగుల దాడుల నుంచి అన్నదాతలను ఆదుకోవాలని కోరుతున్నారు.
ఇవీ చూడండి...