తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో ప్రచార గడువు ముగిసిన కారణంగా.. 144 సెక్షన్ అమల్లోకి వచ్చినట్లు చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు. తిరుపతి ఆర్డీవో కార్యాలయంలో అనంతపురం రేంజ్ డీఐజీ కాంతిరాణాటాటా తో కలిసి ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. చిత్తూరు జిల్లాలో ఉన్న తిరుపతి, సత్యవేడు, శ్రీకాళహస్తి నియోజక వర్గాల్లో పటిష్ఠ నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 7 లక్షల 40 వేల ఓటర్ల కోసం 1056 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు.
గ్రామ, వార్డు వాలంటీర్లు ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంటారని కలెక్టర్ తెలిపారు. తిరుపతిలో స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులు మినహా స్థానికేతరులు లాడ్జ్ల్లో, అతిథి గృహాల్లో నివసించరాదని ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. 377 పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామన్న అనంతపురం రేంజ్ డీఐజీ కాంతిరాణా టాటా.. అక్కడ సెంట్రల్ ఆర్మడ్ఫోర్స్, వెబ్ కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్స్తో నిఘా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. రాత్రి 7 తర్వాత స్థానిక ఓటర్లు కాని వారు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఉండరాదని ఇప్పటికే ఆదేశించారు.
ఇదీ చదవండి:
తిరుపతి ఉపపోరు: మైకులు మూగబోయాయి.. మిగిలింది ప్రజా తీర్పే..!