HEALTH BULLETIN OF TARAKA RATNA : నటుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రి వైద్యులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు సాయంత్రం బెంగళూరులోని ఆసుపత్రికి చేరుకున్నారు. తారకరత్నకు చికిత్స అందిస్తున్న వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తారకరత్న తండ్రి మోహన కృష్ణ, పురంధేశ్వరి, నందమూరి సుహాసిని, పరిటాల శ్రీరామ్, మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, చిన రాజప్ప తదితరులు ఆసుపత్రికి చేరుకుని పరామర్శించారు. నందమూరి అభిమానులు భారీగా తరలిరావడంతో నారాయణ హృదయాలయ ఆసుపత్రి వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
హెల్త్ బులిటెన్: సినీ హీరో నందమూరి తారకరత్నకు చికిత్స అందిస్తోన్న నారాయణ హృదయాలయ ఆస్పత్రి వర్గాలు మధ్యాహ్నం ఆయన హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశాయి. తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని అందులో వెల్లడించారు. తారకరత్నకు ప్రత్యేక బృందం పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘‘కార్డియాలజిస్ట్‌లు, ఇంటెసివిస్ట్‌లు, ఇతర స్పెషలిస్ట్‌లు తారకరత్న ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ట్రీట్‌మెంట్ కొనసాగిస్తున్నాం’’ అని ఆస్పత్రి వర్గాలు ప్రకటనలో తెలిపాయి.
అసలేం ఏం జరిగిందంటే?: చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు. పాదయాత్రలో కొద్ది దూరం నడిచిన ఆయన అకస్మాత్తుగా సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే యువగళం సైనికులు, భద్రతా సిబ్బంది కారులో కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం పట్టణంలోని పీఈఎస్ వైద్యకళాశాల ఆస్పత్రికి తరలించారు. అనంతరం వైద్యులు, కుటుంబసభ్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇవీ చదవండి: