తిరుపతిలో దశాబ్దాలుగా సమస్యలు పేరుకుపోయాయి. చాలా చోట్ల ప్రగతి పనులు ముందుకు సాగడం లేదు. ఎప్పుడో నిర్మించిన భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతిని.. చినుకు పడితే చాలు నగరం చిత్తడవుతోంది. ప్రధాన కూడళ్లను కలిపే అంతర్గత రహదారులు వాహనదారులకు చుక్కలు చూపుతున్నాయి. తెలుగుగంగ కాలువ, కల్యాణి డ్యాంలో నీరు సమృద్ధిగానే ఉంటున్నా.. సరైన పైపులైన్ వ్యవస్థ లేక తాగునీటి అవస్థలు తలెత్తున్నాయి.
ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టేలా.. తిరుపతి నగరపాలక సంస్థ సరికొత్త ప్రణాళికలు రచిస్తోంది. కేంద్రం జాబితాలో ఆకర్షణీయ నగరంగా ఉన్న తిరుపతిలో.. మౌలిక సదుపాయాలు మెరుగుపర్చేందుకు పురపాలక శాఖ రూ.183 కోట్లు విడుదల చేసింది. ఈ క్రమంలో.. అభివృద్ధి పనుల నిమిత్తం తిరుపతిలో 4 విభాగాల్లో 267 పనులకు టెండర్లు పిలిచేందుకు నగరపాలక సంస్థ అధికారులు సిద్ధమయ్యారు. 79 సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.72.25 కోట్లు కేటాయించారు.
వీటితో ప్రధాన కూడళ్లను అనుసంధానించేలా రహదారుల పునర్నిర్మాణం, మరమ్మతులు చేపట్టనున్నారు. వివిధ ప్రాంతాల్లో 93 డ్రైన్లు, కల్వర్టుల నిర్మాణానికి 63.72 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో వర్షపునీటి పారుదల కోసం 53 తూములు ఏర్పాటు చేయనున్నారు. ఎప్పుడో దశాబ్దాల క్రితం నిర్మించిన డ్రైనేజీ కాలపరిమితి తీరిపోయి.. వర్షం పడితే నగరం చిత్తడిగా మారుతోంది. ఈ పరిస్థితులను దూరం చేసేందుకు తూములను నిర్మించనున్నారు.
తాగునీటి సరఫరా వ్యవస్థలో లోపాలను సరిదిద్దడంపైనా అధికారులు దృష్టి సారించారు. సమస్యలను దూరం చేయడం ద్వారా తిరుపతిని అసలు సిసలైన ఆకర్షణీయ నగరంగా తీర్చిదిద్ది.. మరింత మంది భక్తులు, పర్యాటకులను ఆకర్షించేందుకు నగరపాలక సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఇదీ చదవండి: