Sucharitha Dasireddy special story: మాది పెద్దతిప్ప సముద్రం మండలం కందుకూరు దగ్గర బాగేపల్లి అనే చిన్న పల్లె. వ్యవసాయ కుటుంబం. అమ్మ అనసూయ, నాన్న దాసిరెడ్డి. అమ్మ పదోతరగతిలో ప్రథమ ర్యాంకు సాధించినా కొనసాగించలేకపోయింది. అందుకే మమ్మల్నైనా బాగా చదివించాలనుకున్నారు. బి.కొత్తకోటలో అమ్మమ్మ దగ్గర ఉండి చదువుకున్నా. చదువులో ఎప్పుడూ ముందే. జేఎన్‌టీయూ అనంతపురంలో బీటెక్ చేశా. తమ్ముడు బెంగళూరులో చదివేవాడు. చదువంటే వాళ్లకెంత ఇష్టం ఉన్నా అమ్మానాన్న ఎప్పుడూ మమ్మల్ని ఒత్తిడి చేయలేదు. కానీ.. ‘జీవితంలో ఏ మలుపైనా రావొచ్చు. సిద్ధంగా ఉండాలి. ఏ పరిస్థితిలోనైనా బతకగలగాలి’ అని అమ్మ చెప్పేది. ఈ మాటలు నాలో నాటుకుపోయాయి. బీటెక్‌లో చేరినప్పటి నుంచే సొంతంగా ఏదైనా చేయాలనుండేది. అప్పుడే ఐఐఎంలో ఎంబీఏ చేస్తే కోరిన కెరియర్ సాధించొచ్చని విన్నా. ఎలాగైనా ఆ సంస్థలో చదవాలని నిర్ణయించుకున్నా. కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండాలని ముందు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో చేరా. ఉద్యోగం చేస్తూనే క్యాట్‌కు ప్రిపేర్ అయ్యా. ఐఐఎం, అహ్మదాబాద్‌లో పీజీ చేసి, అమెజాన్‌లో కొలువు సాధించా.
అక్కడ సహోద్యోగుల్లో ఎక్కువగా పిల్లల చర్చే. కష్టపడి చదివి, ఉద్యోగాల్లో చేరిన అమ్మాయిలు పెళ్లయ్యాక పిల్లల్ని చూసుకునే వాళ్లు లేరంటూ గ్యాప్ తీసుకోవడమో మానేయడమో చూశా. చాలామంది సరైన డే కేర్ సెంటర్స్ లేవనేవారు. అప్పటికే బెంగళూరులో 3 వేలున్నాయి. పిల్లల ఆరోగ్యం, ఆహారం గురించిన సమాచారాన్ని స్కూల్స్ ఇవ్వలేకపోవడమే సమస్య. దాంతో కొన్ని ప్రీ స్కూల్స్‌కెళ్లి తరగతిలో ఓ మూల కూర్చుని సమస్యలను తెలుసుకొనే ప్రయత్నం చేశా. సెలవులు, హోంవర్క్ వంటి ప్రతి చిన్న సమాచారాన్ని పిల్లల డైరీలో రాయాల్సి రావడానికితోడు మేనేజ్‌మెంట్ వర్క్‌తో టీచర్లు బిజీగా ఉండటం గుర్తించా. ఈ సమాచారంతో తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు వారధిలా యాప్‌ను రూపొందించాలనుకుని, ఉద్యోగానికి రాజీనామా చేశా.
అనుసంధానంగా నిలవాలని...
మా వారు శశిధర్ రెడ్డి కంప్యూటర్ ఇంజినీర్. తన చేయూతతో ‘క్రియో ప్రీ స్కూల్ మేనేజ్‌మెంట్ యాప్’ 2018లో రూపొందించా. మొదట బెంగళూరులో దాదాపు 200 ప్రీస్కూల్స్‌కు తిరిగి చూపించా. టెక్నాలజీ పరిజ్ఞానం లేకపోయినా సునాయాసంగా ఫోన్ ద్వారా దీన్ని వినియోగించేలా తయారు చేశాం. టీచర్లూ కాగితంతో పని లేకుండా ఏ సమాచారాన్నైనా అమ్మానాన్నలకు పంపొచ్చు, ఆఫీస్ వర్క్‌నూ పూర్తి చేసుకోవచ్చు. మొబైల్ బేస్డ్ ట్రాకింగ్‌నూ ఉంచాం. మొదటినెలలోనే 40 పాఠశాలలు యాప్‌ను తీసుకున్నాయి. అప్పుడు ఏటా కొంత కట్టించుకునే వాళ్లం. తర్వాత కరోనా వల్ల స్కూళ్లకు ఫీజులు వసూలు కాకపోవడం, కొందరు తల్లిదండ్రులు ఉపాధి కోల్పోవడం చూసి ఉచితంగా అందిస్తున్నా. ప్రస్తుతం 103 దేశాల్లో 3వేలు, మన దేశంలో 1700 స్కూళ్లు దీన్ని వినియోగిస్తున్నాయి. యాప్‌లో 40 ఆప్షన్స్ ఉంటాయి. మా ఆర్యకి రెండున్నరేళ్లు. వాడి చదువు కోసం ఆలోచించే నాలాంటి తల్లుల కోసం ‘న్యూ ఏజ్ ప్లాట్‌ఫాం’ను క్రియోకు కలిపాం. దీనిలో దేశవ్యాప్తంగా 10 వేల పాఠశాలల వివరాలు, వాటి దూరం సహా ఎన్నో వివరాలు ఉంచాం. కొత్త తరం అవసరాల కోసం ‘బియాండ్ క్లాస్’నూ ప్రారంభించనున్నాం. దానిలో పిల్లల వయసుకు తగ్గ యాక్టివిటీస్, క్రీడలు, నైపుణ్యాలను ఉంచనున్నాం. అమ్మాయిలు కెరీర్‌లో స్థిరపడిన తర్వాత కూడా మనసుకు నచ్చిన రంగంవైపు ధైర్యంగా అడుగులేయాలి. కొత్తగా ఏదైనా చేయాలనుకుంటే ముందుగా దానివల్ల ఏం సాధిస్తాం.. మనకు, కుటుంబానికి, సమాజానికి దానివల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి.. వంటివన్నీ ఆలోచించాలి. వీటిపై అవగాహన కల్పించగలిగా కాబట్టే రెండుసార్లు మంచి హోదా, జీతం ఉన్న ఉద్యోగాలు మానేసినా.. ఇంట్లో వాళ్లు నాపై భరోసా ఉంచారు. నా విజయానికి కారణమయ్యారు.
ఇదీ చూడండి: