చిత్తూరు జిల్లా మదనపల్లెలో ప్రభుత్వం ప్రకటించిన పథకాలతో మున్సిపల్ పాఠశాలలు విద్యార్థులతో కళకళలాడుతున్నాయి. అయితే సరిపడా మౌలిక వసతులు లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఓ వైపు గదులు.. మరోవైపు ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థులు చదువు కొనసాగించలేక పోతున్నారు. ఇక తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుడు వెళ్లేందుకు దారి లేకుండా విద్యార్థులతో నిండిపోయాయి. బల్లలు సరిపోక కొంతమంది నేలపై కూర్చొని చదువుకోవాల్సి వస్తోంది. నీరుగట్టువారిపల్లెలోని మాయాబజార్‌లో ఉన్న వివేకానంద మున్సిపల్ ఉన్నత పాఠశాల-2కు ఇప్పటి వరకు కూడా ప్రత్యేక తరగతి గదులు లేవు.
దీంతో విద్యార్థులంతా ప్రాథమిక పాఠశాలలోనే చదువుకోవాల్సి వస్తోంది. ఇప్పటికే ఈ పాఠశాలలో 410 మంది విద్యార్థులు ఉండగా ఉన్నత పాఠశాలలో 443 మంది చేరారు. వేరే పాఠశాల కేటాయిస్తామన్న అధికారులు దీని గురించి పట్టించుకోవడం లేదు. ఒక్కో తరగతి గదిలో 40కి మించి ఉండకూడదన్న నిబంధన ఉన్నప్పటికి ఈ పాఠశాలలో 90 నుంచి 100 మంది వరకు ఉంటున్నారు. రామిరెడ్డి లేఅవుట్‌లో ఉన్న వివేకానంద మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 1281 మంది విద్యార్థులుంటే 20 గదులే ఉన్నాయి. మరో 20 గదుల అవసరం ఉంది. ఈ పాఠశాలలో ఒక్కో తరగతి గదిలో 70 నుంచి 80 మంది వరకు చదువుతున్నారు. చాలా పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులు క్రీడలతో పాటు క్రమశిక్షణకు దూరం అవుతున్నారు.
105 మంది ఉపాధ్యాయులు అవసరం...
పట్టణంలో 21 మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలుంటే 4500 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రస్తుతం 108 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఇక ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 10 ఉంటే 3648 మంది చదువుతున్నారు. 72 మంది ఉపాధ్యాయులున్నారు. వీటన్నింటికి కలిపి ఇంకా 105 మంది ఉపాధ్యాయుల అవసరం ఉంది.
గదుల కొరతతో ఇబ్బందులు..
పాఠశాలలో గదుల కొరత కారణంగా కొంతమంది విద్యార్థులు బల్లలపైనా, మరికొందరు కింద కూర్చొంటున్నారు. మా తరగతి గదిలో 75 మంది విద్యార్థులున్నారు. గదుల కొరత కారణంగా ఈ సమస్య తలెత్తింది. అధికారులు స్పందించి గదుల నిర్మాణం చేస్తే ఉపయోగంగా ఉంటుంది. - సింధు, పదోతరగతి, వివేకానంద మున్సిపల్ ఉన్నత పాఠశాల రామిరెడ్డిలేఅవుట్
ఒకే హిందీ ఉపాధ్యాయుడు...
మా పాఠశాలలో 1281 మంది విద్యార్థులు చదువుతున్నారు. అన్ని తరగతులకు కలిపి ఒకే హిందీ ఉపాధ్యాయుడు ఉన్నారు. వివిధ తరగతుల్లో కూడా చాలా మంది ఉపాధ్యాయులు లేరు. కొత్తవారిని నియమిస్తే విద్యార్థుల ఇబ్బందులు తొలగుతాయి. - ఎ.భరత్, 7వ తరగతి, వివేకానంద మున్సిపల్ ఉన్నత పాఠశాల, రామిరెడ్డి లేఅవుట్
సమస్యల పరిష్కారానికి కృషి
మున్సిపల్ పాఠశాలల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. గదుల కొరతపై ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక పంపాం. అలాగే ఉపాధ్యాయుల కొరత అధిగమించేందుకు విద్యావాలంటర్ల కోసం నివేదిక పంపడం జరిగింది. - జి.రవి. మున్సిపల్ కమిషనర్, మదనపల్లె
ఇదీ చదవండి:
వాలంటీర్ వ్యవస్థను వైకాపా దుర్వినియోగం చేస్తోంది: సోము వీర్రాజు