కరోనా వల్ల విధించిన లాక్డౌన్ కారణంగా మరో నెలలో రాబోయే మామిడి సీజన్(జూన్-ఆగస్టు)లో రైతులు నష్టపోకుండా.. ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టినట్లు చిత్తూరు కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు. రైతులు, గుజ్జు పరిశ్రమ యజమానులతో కలెక్టరేట్లో ఆయన సమావేశం నిర్వహించారు. టమాటా రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా ఇప్పటికే పరిశ్రమల యాజమాన్యాలతో మాట్లాడామని.. అలాగే మామిడి రైతులకు న్యాయం జరిగేలా చేస్తామని చెప్పారు.
జిల్లాలో సుమారు 1.2లక్షల హెక్టార్లలో మామిడి సాగవుతుంటే.. ఐదు లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తోందని కలెక్టర్ అన్నారు. వీటిలో నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు తోతాపురి రకానికే చెందినవని పేర్కొన్నారు. ఈ రకం మామిడిని గుజ్జు కోసం ఉపయోగిస్తారు కాబట్టి… సంబంధిత పరిశ్రమలతో మాట్లాడి, రైతులకు మంచి ధర వచ్చేలా చూస్తామన్నారు. టేబుల్ రకం మామిడిని ఎగుమతి చేసేందుకు పలు ప్రాంతాల్లో లాక్డౌన్ ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో కిసాన్ రైలు ద్వారా ఎగుమతి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యల గురించి రైతులు, గుజ్జు పరిశ్రమ యజమానులు కలెక్టర్కు వివరించారు.
ఇదీచదవండి: దూసుకొస్తున్న 'యాస్'...రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం!