తనను వైకాపా నేతలు వేధించారంటూ పోలీసులకు చిత్తూరు జిల్లాకు చెందిన డాక్టర్ అనితా రాణి ఫిర్యాదు చేసిన వ్యవహరంపై ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి వాస్తవాలు నిగ్గుతేల్చాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. దళిత మహిళనైన తనను వైకాపా నేతలు నిర్బంధించి వేధించారని, అసభ్య పదజాలంతో దూషించారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజక వర్గంలోని పెనుమూరు ప్రభుత్వ వైద్యురాలిగా పనిచేస్తుండగా.. దిగువ స్థాయి సిబ్బంది అవినీతిని ప్రశ్నించినందుకు తనపై కక్ష కట్టారని ఫిర్యాదు చేశారు. మార్చి 22న తనను హాస్టల్ గదిలో నిర్భంధించి, స్థానిక వైకాపా నేతలు రకరకాలుగా హింసించారని, దుర్భాషలాడుతూ అభ్యంతరకరంగా ప్రవర్తించారని ఫిర్యాదులో తెలిపారు. బాత్‌రూంలోకి వెళ్లినా తనను ఫొటోలు, వీడియోలు తీశారని ఫిర్యాదులో తెలిపారు. తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా దారుణంగా వ్యాఖ్యలు చేశారని తెలిపారు. స్థానిక పోలీసులు పట్టించుకోకపోవడంతో వారం క్రితం హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సోషల్ మీడియాలోనూ వైద్యురాలి వేధింపుల వ్యవహారం విస్తృత ప్రచారమైంది. ఈ వ్యవహారం తన దృష్టికి రావడంతో స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీఐడీ విచారణకు ఆదేశించారు. నిజానిజాలేంటో తేల్చాలని సీఐడీకి సీఎం జగన్ ఆదేశించారు.
ఆమెపై చర్యలు తీసుకోలేదు: డీఎంహెచ్‌వో
తనపై దౌర్జన్యానికి దిగిన వారి రాజకీయ ప్రాబల్యంతో పెనుమూరు పీహెచ్‌సీ నుంచి చిత్తూరు టీబీ ఆసుపత్రికి తనను బదిలీ చేసి వేధింపులకు పాల్పడుతున్నారంటూ అనితా రాణి తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడితో అనితతో ఫోన్ కాల్‌లో మాట్లాడారు. దీనిపై చిత్తూరు జిల్లా వైద్యాధికారి పెంచలయ్య వివరణ ఇచ్చారు. అనితా రాణి ఆరోపిస్తున్న విధంగా ఆమెపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదని చెప్పారు. కేవలం పెనుమూరు నుంచి చిత్తూరు టీబీ ఆసుపత్రికి డిప్యూటేషన్‌పై వచ్చారని చెప్పారు. ఆమె విధుల్లోనే కొనసాగుతున్నారని, ఆమెను సస్పెండ్ గానీ సరెండర్ కానీ చేయలేదన్నారు.