Chittoor Tomato Farmer chandramouli Turned Millionaire : ప్రస్తుతం ఎక్కడ విన్నా.. ఎవరిని అడిగినా ఠక్కున ఎర్ర పండు హవా నడుస్తోందని ఇట్టే చెప్పేస్తారు. దేశంలో టమాటా ధరల టాపిక్ ట్రెండింగ్లో నడుస్తోంది. రోజురోజుకు ఆకాశాన్నంటుతున్న ఈ కూరగాయల ధరలు సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. ప్రతి సంవత్సరం టమాటా ధరలు పెరగటం సహజం కానీ ఈ సంవత్సరం ధరలు అమాంతంగా పెరగడంతో మనం ఎప్పుడు చూడని విధంగా పేద రైతులు ధనికులుగా మారిపోతున్నారు. నిన్నటి, మొన్నటి వరకూ పక్క రాష్ట్రాల్లో కోటీశ్వరులు అయిన రైతులను చూశాం. ఇప్పుడు మన రాష్ట్రానికి చంద్రమౌళి అనే రైతు కోటీశ్వరుడు అయ్యారు. టమాటా పంటను ఎలా సాగు చేశాడో.. ఎటువంటి పద్దతులు వాడారో తెలుసుకుందాం.
ప్రస్తుతం దేశంలో టమాటా ధరలు ఆకాశాన్నంటిన నేపథ్యంలో ఓ వైపు ధరల భారం సామాన్యుల జేబులు ఖాళీ చేస్తుండగా.. మరొక వైపు అనూహ్యంగా లభించిన ధరతో టమాటా రైతుల జేబులు నిండుతున్నాయి. టమాటా ఎక్కువగా సాగయ్యే చిత్తూరు జిల్లాకు చెందిన ఓ రైతు కుటుంబం కేవలం నెల రోజుల వ్యవధిలోనే 3 కోట్ల రూపాయల ఆదాయం పొందింది. వేసవి కాలం అనంతరం వచ్చే పంటకు మంచి ధర వస్తుందని గుర్తించిన ఆ కుటుంబం.. రెండు సంవత్సరాలుగా జూన్, జులైలో పంట చేతికి వచ్చేలా టమాటా పంటను సాగు చేశారు.
జిల్లాలోని సోమల మండలం కరకమంద గ్రామానికి చెందిన పి. చంద్రమౌళి, అతని తమ్ముడు మురళి, తల్లి రాజమ్మ ఉమ్మడిగా వ్యవసాయం చేస్తున్నారు. వీరికి స్వగ్రామం అయిన కరకమందలో 12 ఎకరాలు, పులిచెర్ల మండలం సువ్వారపువారిపల్లెలో 20 ఎకరాల పొలం ఉంది. ఎన్నో సంవత్సరాలుగా టమాటానే సాగు చేస్తున్నారు. ఆధునిక సేద్య విధానాలు, నూతన వంగడాలు, మార్కెటింగ్ వ్యూహాలపై చంద్రమౌళి ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకున్నారు. అందులో భాగంగా వేసవి కాలం తరువాత వచ్చే టమాటా పంట దిగుబడికి మంచి ధర పలుకుతున్నట్లు గుర్తించి ఆ విధంగా ఏప్రిల్‌లో మొక్కలు నాటి జూన్ నాటికి దిగుబడి ప్రారంభమయ్యేలా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.
ఈ సంవత్సరం ఏప్రిల్‌లో సాహూ రకం టమాటా మొక్కలు 22 ఎకరాల్లో నాటారు. కట్టెసాగు విధానంలో మల్చింగ్, సూక్ష్మ సేద్య పద్ధతులను పాటించారు. జూన్ చివరిలో దిగుబడి ప్రారంభం అయ్యింది. దిగుబడిని జిల్లాకు దగ్గరగా ఉండే పక్క రాష్ట్రమైన కర్ణాటకలోని కోలార్ మార్కెట్‌లో విక్రయించారు. విపణిలో 15 కిలోల పెట్టె ధర రూ.వెయ్యి నుంచి రూ.1500 మధ్య పలికింది. ఇప్పటి వరకు 40వేల పెట్టెలు విక్రయించగా రూ.4 కోట్లు ఆదాయం వచ్చినట్లు రైతు చంద్రమౌళి తెలిపారు. అందులో ఎకరాకు రూ.3 లక్షల చొప్పున పెట్టుబడి 22 ఎకరాలకు రూ.70 లక్షలు, విపణిలో కమీషన్ రూ.20 లక్షలు, రవాణా ఖర్చులు రూ.10 లక్షలు పోగా రూ.3 కోట్ల ఆదాయం వచ్చిందని టమటా రైతు ఆనందం వ్యక్తం చేశారు.