చిత్తూరు జిల్లాపై నివర్ తుపాను ప్రభావం ప్రారంభమైంది. జిల్లాలోని తూర్పు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. అప్రమత్తమైన అధికారులు.. లోతట్టు ప్రాంత ప్రజలను వరద సహాయ కేంద్రాలకు తరలిస్తున్నారు. తుపాను సహాయ చర్యల పర్యవేక్షణకు ముగ్గురు జిల్లాస్థాయి అధికారులను ఇన్ఛార్జిలుగా నియమించారు. రెండు రోజుల పాటు జిల్లాలోని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. రానున్న 36 గంటల్లో తుపాను తీవ్రంగా ఉంటుందని...ఇళ్లనుంచి బయటకు రావద్దని ప్రజలకు జిల్లా పాలనాధికారి విజ్ఞప్తి చేశారు.
ప్రధానంగా తూర్పు ప్రాంతమైన శ్రీకాళహస్తి, సత్యవేడు, నగరి నియోజకవర్గాల్లో నివర్ ప్రభావం అధికంగా ఉంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొన్న అధికారులు తుపాను తీవ్రత అధికంగా ఉండే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. కేవీబీపురం, వరదయ్యపాలెం, పిచ్చాటూరు, నాగలాపురం, సత్యవేడు మండలాల్లో రాత్రికి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని వరద సహాయ కేంద్రాలకు తరలిస్తున్నారు. కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 669 చెరువులకు ప్రమాదముందని గుర్తించిన అధికారులు.. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జడ్పీ సీఈఓ, సంయుక్త కలెక్టర్, తిరుపతి ఆర్డీఓలు వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
తిరుమలలో అప్రమత్తం..
తిరుమలలోని జలాశయాలు ఇప్పటికే పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. నివర్ తుపాను ప్రభావంతో జలాశయాల పర్యవేక్షణ అధికారులు అప్రమత్తమయ్యారు. కుమారధార, పసుపు ధార, పాపవినాశనం జలాశయాలు నిండుకుండా ఉన్నాయి. పాపవినాశనం డ్యాం గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. గోగర్బం జలాశయం గేట్లు తెరిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదీ చూడండి: