పరిషత్ ఎన్నికల్లో భాగంగా చిత్తూరు జిల్లా పరిషత్ అధ్యక్ష పీఠం జనరల్‌కు కేటాయించారు. ఈ మేరకు రిజర్వేషన్ల రాజపత్రాన్ని పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజాశంకర్ శుక్రవారం విడుదల చేశారు. మొదటి విడత సాధారణ ఎన్నికలు 1995లో నిర్వహించారు.. అప్పట్లో జెడ్పీ ఛైర్‌పర్సన్ స్థానం ఎస్సీ జనరల్‌కు కేటాయించారు. దీంతో గోవిందస్వామి జడ్పీ ఛైర్మన్‌గా గెలుపొంది 2001 వరకు బాధ్యతలు నిర్వర్తించారు. 2001 ఎన్నికల్లో బీసీ మహిళకు రిజర్వు అయింది. ఈ కోటాలో ఛైర్‌పర్సన్‌గా రెడ్డమ్మ 2006 వరకు వ్యవహరించారు. ఆపై 2006లో నిర్వహించిన స్థానిక ఎన్నికల్లో జడ్పీ పీఠం అన్‌రిజర్వుకు దక్కింది. దీంతో సుబ్రహ్మణ్యంరెడ్డి ఛైర్మన్‌గా 2011 వరకు పాలన కొనసాగించారు. అనంతరం మూడేళ్లపాటు ఎన్నికలు నిర్వహించలేదు.
రాష్ట్రంలో అప్పట్లో నెలకొన్న ‘ప్రత్యేక’ పరిస్థితులు, ఆపై రాష్ట్ర విభజన, వెరసి మూడేళ్ల పాటు ఎన్నికల ఊసేలేదు. అప్పటి వరకు ఇక్కడ పనిచేసిన జిల్లా కలెక్టర్లే జెడ్పీ ప్రత్యేకాధికారులుగా వ్యహరించారు. అనంతరం 2014లో ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో జెడ్పీ పీఠం అన్‌రిజర్వుడ్ మహిళకు కేటాయించారు. అప్పట్లో చిత్తూరు గ్రామీణ మండల జెడ్పీటీసీ స్థానం నుంచి పోటీచేసిన ఆర్.గీర్వాణి జెడ్పీ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికై 2019 వరకు బాధ్యతలు నిర్వర్తించారు. ఆపై ఎన్నికలు నిర్వహించలేదు. పాలకవర్గాల గడువు ముగియడం, సార్వత్రిక సమరం నేపథ్యంలో ఈ ఎన్నికలు వాయిదాపడ్డాయి. దీంతో ఏడు నెలలుగా జిల్లా పాలనాధికారి జెడ్పీ ప్రత్యేకాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పలుమార్లు రిజర్వేషన్ల గందరగోళం అనంతరం తాజాగా అధికారికంగా రిజర్వేషన్లు(50శాతం మేర) ప్రకటించారు.
ఇదీ చదవండి : స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల