చిత్తూరు జిల్లా తంబళ్ళపల్లె నియోజకవర్గం పరిధిలో జరిగే పంచాయితీ ఎన్నికలకు.. అభ్యర్థుల తుది జాబితాను వెంటనే ప్రకటించాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. నిబంధనల ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియగా.. రాత్రి 8:30 గంటల వరకు అభ్యర్థుల తుది జాబితా ప్రకటించలేదని చంద్రబాబు అన్నారు. ఈ విషయంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు ద్వారకానాథరెడ్డి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని లేఖలో పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలోని కొందరు అధికారులు వైకాపాకు అనుకూలంగా విధులు నిర్వర్తిస్తున్నారని ఆరోపించారు. ములకలచెరువు సీఐ సురేశ్ కుమార్, ఎమ్మెల్యే ద్వారకానాథ రెడ్డి.. పీఏ హేమంత్ కుమార్ యాదవ్.. ప్రతిపక్షాల అభ్యర్థుల నామినేషన్లను ఉపసంహరించుకోవాలని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులో తెలిపారు. ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించిన ములకలచెరువు సీఐ సురేశ్ కుమార్‌ను తక్షణమే బదిలీ చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
తంబళ్లపల్లె పరిధిలో జరిగే పంచాయితీ ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరిగేలా చూడాలని అన్నారు. ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ సమయంలో అదనపు బలగాలను కేటాయించాలన్నారు.