తెలుగు భాషాభివృద్ధికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని.. తెలుగు భాష, సంస్కృతులను భావితరాలకు అందించాల్సిన అవసరముందని శాసనమండలి ఛైర్మన్ మహమ్మద్ అహ్మద్ షరీఫ్ పేర్కొన్నారు. తెలుగు భాష, సంస్కృతుల అభివృద్ధి అధ్యయనంలో భాగంగా బుధవారం శ్రీవేంకటేశ్వర వర్సిటీకి ఏపీ శాసనమండలి కమిటీ విచ్చేసింది. సెనేట్ హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కళాశాలలు, విశ్వవిద్యాలయాల స్థాయిలో తెలుగు భాషకు సంబంధించిన బోధన, పరిశోధన రంగాలు మరింత విస్తృతమవ్వాల్సిన అవసరముందన్నారు.
అప్పుడే భాష పదికాలాల పాటు మనుగడ సాగిస్తుందని చెప్పారు. పక్క రాష్ట్రాల్లో వారు మాతృభాషకు పెద్దపీట వేస్తున్నారని, ఆ దిశగా మనమూ చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని పేర్కొన్నారు. కమిటీ సభ్యులు కత్తి నరసింహారెడ్డి, పవన్, పీవీఎన్ మాధవ్, విఠపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తెలుగు భాషాభివృద్ధికి వర్సిటీలు పెద్దన్న పాత్ర పోషించి మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఆచార్య పేట శ్రీనివాసులురెడ్డి, వర్సిటీ ప్రాచ్య పరిశోధన సంస్థ సంచాలకులు డాక్టర్ సురేంద్రరెడ్డి, వీసీ ఆచార్య రాజారెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చదవండి:
రాష్ట్రంలో స్కామ్లే తప్ప ఒక్క స్కీం లేదు: విష్ణువర్ధన్ రెడ్డి