తిరుపతి రుయా ఆసుపత్రిలో ఈనెల 10న ఆక్సిజన్ సరఫరాలో సమస్యలు తలెత్తడంతో పలువురు మరణించిన విషయం తెలిసిందే. దుర్ఘటనలో 11 మంది మృతి చెందినట్లు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ ఆ రోజే ప్రకటించారు. ప్రతిపక్షాలు మాత్రం పెద్ద ఎత్తున మరణాలు సంభవించాయని విమర్శించాయి. దీనిపై కాంగ్రెస్ నేత చింతా మోహన్ జాతీయ మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయగా.. భాజపా నేత భానుప్రకాష్‌రెడ్డి గవర్నర్‌కు లేఖ రాయడంతో పాటు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
ఈ నేపథ్యంలో కొత్తగా మరో 12 మందికి పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం ఇటీవల నిధులను విడుదల చేసింది. తొలుత ప్రకటించిన 11 మందితో పాటు ఇప్పుడు మంజూరు చేసిన వారిని కలిపితే మొత్తం 23 మంది ఈ దుర్ఘటనలో చనిపోయినట్లు స్పష్టమవుతోంది. ఈ విషయమై రుయా సూపరింటెండెంట్ డాక్టర్ భారతి స్పందిస్తూ.. నాడు ఆక్సిజన్ అందక 11 మంది చనిపోయారని, ఆ ప్రభావం వల్ల తర్వాత మరికొందరు మృతి చెందినట్లు వెల్లడించారు.
వీరి వివరాలు పంపాలని జిల్లా కలెక్టర్ కోరినట్లు చెప్పారు. ఇందుకు అనుగుణంగా 12 మంది జాబితాను పంపించినట్లు స్పష్టం చేశారు. రుయా అధికారులు ఇచ్చిన నివేదిక అనుసరించి ఆరుగురికి చెక్కులను పంపిణీ చేసేందుకు తహసీల్దార్లకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇవ్వగా చెక్కుల పంపిణీ పూర్తి చేశారు. మరోవైపు ఇదే దుర్ఘటనలో తన భర్త చనిపోయినా పరిహారం జాబితాలో పేరు చేర్చలేదని పీలేరుకు చెందిన లక్ష్మి కన్నీటి పర్యంతమయ్యారు. న్యాయం చేయాలని కోరారు.
ప్రతిపక్షాల మండిపాటు
తాము ముందు నుంచి చెబుతున్నదే వాస్తవమైందని విపక్షాలు పేర్కొన్నాయి. ప్రభుత్వం తమకు అనుకూలమైన వారిని రక్షించేందుకు మృతుల సంఖ్యను దాచిపెడుతోందని భాజపా నేత భానుప్రకాష్‌రెడ్డి విమర్శించారు. ఈ అంశంపై న్యాయ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: