తిరుమల శ్రీవారిని మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ దర్శించుకున్నారు. నైవేద్యం ఘంట సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకున్నారు. దేవెగౌడకి తితిదే అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో మాజీ ప్రధానికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. కరోనా కారణంగా చాలా కాలంగా స్వామివారి దర్శించుకోలేకపోయానన్న మాజీ ప్రధాని.. దర్శనం కల్పించిన అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.
కేంద్రంలో భాజపా ప్రభుత్వం స్థిరంగా ఉందన్నారు మాజీ ప్రధాని. కేంద్రంలో భాజపా, కాంగ్రెస్యేతర ప్రభుత్వం ఏర్పాటు కష్టమని వ్యాఖ్యానించారు. ఆయా రాష్ట్రాల్లో శక్తివంతంగా ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ ఒకే వేదికపైకి రావాలని కోరారు. ప్రాంతీయ పార్టీలు కలవాలంటే ఉమ్మడి అజెండా కావాలని సూచించారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని మాజీ ప్రధానమంత్రి హెచ్. డి. దేవెగౌడ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం దర్శనానికి వచ్చిన వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం అమ్మవారి ఆశీర్వాదం మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి అమ్మవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు.
ఇదీ చదవండి: ttd:దేవాదాయ శాఖకు తితిదే మరింత చేయూత