చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను ఐషర్ వాహనం ఢీకొట్టటంతో ఐదుగురు మృత్యువాతపడ్డారు. కంభంవారిపల్లి మండలం చిత్తూరు- కడప ప్రధాన రహదారిలోని సొరకాయల పేట చెరువు కట్టపై ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో నలుగురు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఆటో డ్రైవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. మృతుల కలకడ మండలం కొత్తగాండ్లపల్లెకు చెందిన వారిగా గుర్తించారు.
మనవడి చివరి చూపునకు వెళ్లి
కొత్తగాండ్లపల్లెకు చెందిన మహేశ్ బాబు (19) ద్విచక్ర వాహనంపై తన అమ్మ సమాధి వద్ద కొబ్బరికాయ కొట్టి శుక్రవారం మధ్యాహ్నం పీలేరుకు బయలుదేరాడు. కలకడ పట్టణం గ్రామ శివారు బాటవారిపల్లి వద్ద రహదారి పక్కన ఉన్న సిమెంట్ ఇటుకలను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అతని మృతదేహాన్ని పీలేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
తిరుపతిలో ఉంటున్న మహేశ్ అవ్వ, తాత, బంధువులకు విషయం తెలియగానే పీలేరుకు చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. రాత్రి పొద్దుపోయాక వారందరూ తమ స్వగ్రామానికి ఆటోలో తిరుగు ప్రయాణమయ్యారు. కె.వి.పల్లి మండలం చిత్తూరు- కడప ప్రధాన రహదారిలోని సొరకాయల పేట చెరువు కట్టపై ఎదురుగా వచ్చిన ఐషర్ వాహనం వీరి ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో మహేశ్ తాత వెంకట్రామయ్య(55), అవ్వ పార్వతమ్మ(50), అత్త సుజనమ్మ(40), రెడ్డి గోవర్థన్(29) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. దామోదర్(ఆటో డ్రైవర్), లీలావతి, పుష్పలత అనే ముగ్గురు గాయపడగా... పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ దామోదర్ మృతి చెందాడు. కేవీపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.