తోటి కోడళ్ల గొడవ పెద్దదై రచ్చకెక్కింది. రెండు కుటుంబాల మధ్య వివాదం రెండు గ్రామాల మధ్య ఘర్షణకు దారితీసింది. పోలీస్ స్టేషన్ సమీపంలోనే పంచాయితీ పేరుతో ఘర్షణ పడి కొట్టుకుని గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. ఘర్షణను నివారించాల్సిన పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించడమే కాకుండా ఓ వర్గం వారిపై దుర్భాషలాడారు.
చిత్తూరు జిల్లా యాదమరి మండలం పచ్చయప్పవూరుకు చెందిన పరమేశ్వరి, హేమలత తోటి కోడళ్లు. పక్కపక్కనే వీరి నివాసం. పొలం, ఇంటి వద్ద తరచూ గొడవ పడేవారు. గొడవలు పెద్దవి కావడంతో వారి తల్లిదండ్రులు కలగజేసుకున్నారు. తోటి కోడళ్ల స్వగ్రామాలైన.. పూతలపట్టు మండలం చిన్నబండపల్లి, తమిళనాడు రాష్ట్రంలోని అంకణాపల్లి గ్రామాల్లోని.. వారి తరఫు బంధువులు వచ్చారు. శుక్రవారం సాయంత్రం యాదమరి పోలీస్ స్టేషన్ సమీపంలో పంచాయితీ నిర్వహించారు. ఈ క్రమంలోనే మాటామాటా పెరిగి ఇరు వర్గాలు బాహాబాహీకి దిగాయి. పలువురికి గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. రెండు వర్గాల మధ్య జరుగుతున్న ఘర్షణ నివారించకపోగా స్థానిక ఎస్సై సహనం కోల్పోయారు. ఓ వర్గం వారిపైకి వస్తూ అసభ్య పదజాలంతో దూషించారు. మెల్లగా వివాదం సద్దుమణిగాక.. గాయాలైన వారిని చికిత్స కోసం చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి పంపారు. ఇరువర్గాలపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతామని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కరోనా విలయం.. కొత్తగా 8,943 పాజిటివ్ కేసులు