ప్రజావేదిక పంచాయితీ రసవత్తరంగా తయారైంది. ఆదినుంచీ తమకు కేటాయించాలని తెదేపా కోరుతోంది. ప్రస్తుతం తమకే ఇవ్వాలని వైకాపా విన్నవించింది. పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించుకునేందుకు ప్రజావేదికను తమకే కేటాయించాలని ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంను వైకాపా కోరింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి విన్నవించారు. ఇప్పటికే ఇదే అంశంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ప్రజావేదికను ప్రతిపక్ష నేతకు కేటాయించాలని చంద్రబాబు లేఖలో కోరారు. తన నివాసానికి అనుబంధంగా ఉన్న ప్రజా వేదికను తెదేపా అధికారిక కార్యకలాపాల కోసం కేటాయించాలని పేర్కొన్నారు. దీంతో ఈ అంశం ఇప్పుడు ఆసక్తిగా మారింది.
పార్టీ-ప్రభుత్వం మధ్య సమన్వయం...
పార్టీ-ప్రభుత్వం మధ్య సమన్వయం కోసం కార్యక్రమాలకు ప్రజావేదిక అనువుగా ఉంటుందని తలశిల రఘురాం పేర్కొన్నారు. ప్రజావేదికలో నిర్వహించే సమావేశాలకు వైకాపా అధ్యక్షుని హోదాలో సీఎం జగన్ హాజరవుతారని ఆయన తెలిపారు. సీఎం భద్రత, ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా ప్రజావేదిక అనువుగా ఉంటుందని రఘురాం పేర్కొన్నారు. సీఎం భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజావేదికను తమ పార్టీకి కేటాయించాలని సీఎస్‌కు విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు. అంతేకాకుండా ప్రజావేదిక అక్రమకట్టడమని అధికారులు నిర్దారిస్తే.. తక్షణం ఖాళీ చేసి ఇవ్వడానికి సిద్ధమన్నట్లు రఘురాం తెలిపారు. తెదేపా, వైకాపాలు ప్రజావేదికను తమకే కేటాయించాలంటూ కోరుతుండడంతో ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇదీ చదవండీ: మాతో పెట్టుకుంటే నాశనమైపోతారు: మమత