నవ్యాంధ్ర ప్రధాన నగరం..విజయవాడలో వాహనదారులను ట్రాఫిక్ బెంబేలెత్తిస్తోంది. దీన్ని అధిగమించేందుకు నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు ప్రత్యేక దృష్టి పెట్టి ప్రస్తుత ట్రాఫిక్ విధానాన్ని సమూలంగా ప్రక్షాళన చేసే పనిలో పడ్డారు. ఇప్పటి వరకు రహదారుల ఆధారంగా ట్రాఫిక్ పోలీసుల పరిధి ఉండేది. ఈ విధానంతో క్షేత్రస్థాయిలో పలు సమస్యలు ఎదురవుతున్నాయి. సిబ్బందిని సమర్థంగా వినియోగించుకునేందుకు పునర్ వ్యవస్థీకరణ చేశారు.
విజయవాడ నగర కమిషనరేట్ పరిధిలో నగరంతో పాటు ఇబ్రహీంపట్నం, పెనమలూరు, గన్నవరం, తోట్లవల్లూరు, పమిడిముక్కల, ఉయ్యూరు, కంకిపాడు మండలాలు ఉన్నాయి. ట్రాఫిక్ పరంగా నగర పరిధి కీలకం. రాష్ట్ర విభజన తర్వాత బెజవాడ శరవేగంగా విస్తరించింది. నాలుగేళ్ల క్రితం వరకు పెద్దగా రద్దీ కనిపించని రోడ్లు ఇప్పుడు నిత్యం వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి.
నాలుగుకు పెంపు..
ట్రాఫిక్ విభాగంలో దాదాపు 300 మంది అధికారులు, సిబ్బంది పని చేస్తున్నారు. నగరంలో దాదాపు 120 వరకు ట్రాఫిక్ బీట్లు ఉన్నాయి. అక్కడ నిత్యం విధులు నిర్వర్తించాల్సి ఉంది. కీలకమైన బెంజ్ సర్కిల్, రామవరప్పాడు, పోలీస్ కంట్రోల్ రూమ్, కబేళా, తదితర చోట్ల షిఫ్టు పద్ధతుల్లో 24 గంటలూ పని చేయాలి. గతంలో ట్రాఫిక్ విభాగంలో కేవలం మూడు డివిజన్లు మాత్రమే ఉండేవి. ప్రస్తుతం వీటిని నాలుగుకు పెంచారు. విధుల్లో నిత్యం నగరంలోని ట్రాఫిక్ సిబ్బందితోపాటు ఏపీఎస్ పీ బెటాలియన్ కానిస్టేబుళ్లు, పొరుగున ఉన్న కృష్ణా, గుంటూరు, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల నుంచి విడతల వారీగా పోలీసులు వచ్చి పని చేస్తున్నారు.
అప్పట్లో ప్రధాన రహదారులను ఆధారం చేసుకుని డివిజన్లను విభజించారు. దీనికి శాంతి భద్రతల విభాగం, పోలీసులకు సంబంధం లేకుండా ఉండేది. రెండు విభాగాల మధ్య సమస్వయ లోపం తరచూ వస్తూండేది. ఈ మధ్య వరకు ఏలూరు రోడ్డు, బీఆర్ టీఎస్, పుష్పా హోటల్ కూడలి, మధురానగర్, తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ ను ఒకరే చూడాల్సి వచ్చేది. ఒక ప్రాంతంలో ప్రమాదం జరిగితే స్థానిక పోలీసులకు సమాచారం అందించడంలో జాప్యం జరిగేది.
సమస్యలు తగ్గాయి!
ట్రాఫిక్ సమస్యలకు పునర్ వ్యవస్థీకరణతో చరమగీతం పాడారు. సీపీ ద్వారకా తిరుమలరావు వచ్చిన తర్వాత ఈ అంశంపై ప్రధానంగా దృష్టి పెట్టారు. ట్రాఫిక్ డీసీపీ రవిశంకర్ రెడ్డి తయారు చేసిన ప్రతి పాదనలకు సీపీ ఆమోదించారు. దీని ప్రకారం సాధారణ పోలీసు స్టేషన్ల పరిధులనే ట్రాఫిక్ విభాగానికి నిర్దేశించి...ఈ నిర్ణయాన్ని అమలులోకి తెచ్చారు. నూతనంగా నాలుగో డివిజన్ను ఏర్పాటు చేసి పటమట, పెనమలూరు, కంకిపాడు, ఉయ్యూరు పోలీస్ స్టేషన్లను దీని పరిధిలోకి చేర్చారు. ఇది అమలులోకి రాకముందు ఎవరికి వారే అన్నట్లు ఉండేది. ప్రస్తుతం సమస్యలు కొంత తగ్గాయని ట్రాఫిక్ డీసీపీ రవిశంకర్ రెడ్డి చెబుతున్నారు.