మున్సిపల్ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. రాజధానిలో నిర్మించిన అసెంబ్లీ భవనంలో ఎలాంటి వసతులు, ప్రణాళిక లేకుండా నిర్మించారని ఆరోపించారు. సందర్శకులకు కనీసం కూర్చునే సదుపాయాలూ లేవని అన్నారు. గత ప్రభుత్వం అధికంగా ఖర్చు చేసి నిర్మించిన భవనంలో డొల్లతనం కనిపిస్తోందని విమర్శించారు.
సీఆర్డీఏ, మున్సిపల్ అధికారులతో సమావేశమై ఈ అంశాలపై చర్చించినట్లు మంత్రి తెలిపారు. అసెంబ్లీలో ఛాంబర్ల మార్పు, వసతుల కల్పనపై అధికారులకు సూచనలు చేశామని పేర్కొన్నారు. చంద్రబాబు పరామర్శ యాత్రలు దొంగే దొంగ అన్నట్లు ఉన్నాయని దుయ్యబట్టారు. తెదేపా వాళ్లే దాడులు చేసి తమపై రుద్దేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.