అసెంబ్లీ లాబీల్లో మంత్రి పేర్ని నాని, తెదేపా ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్‌ల మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. నిన్న అసెంబ్లీలో పేర్ని నాని కామెంట్లు వీరి మధ్య ప్రస్తావనకు వచ్చాయి. తాను సభలో చేసిన కామెంట్లకు సంబంధించి వీడియో క్లిప్పింగులు చూశానని... అచ్చెన్నాయుడును ఉద్దేశించి మాట్లాడలేదని, టెక్కలి ప్రజల మనోభావాలను మాత్రమే ప్రస్తావించానని పేర్నినాని అన్నారు. తప్పు మాట్లాడితే క్షమించాలని కోరినట్టు సభలోనే చెప్పానని గుర్తు చేశారు. అచ్చెన్నాయుడు స్పందిస్తూ.. ఏ సందర్భం లేకుండా తన పేరు ప్రస్తావించారని ఆరోపించారు. సందర్భం లేకుండానే తమ నాయకుడి పేరును ఎన్నోసార్లు అచ్చెన్నాయుడు ప్రస్తావించారని పేర్ని నాని అన్నారు.
గతం గతః అని జగన్ చెప్పారని... అందుకే ఈ ఎనిమిది రోజుల కాలంలో తానెక్కడా తప్పు మాట్లాడలేదని అచ్చెన్నాయుడు అన్నారు. ఇచ్చినమ్మ వాయినం, పుచ్చుకున్నమ్మ వాయినం అన్నట్టు గతంలో తమని విమర్శించారు కాబట్టి.. ఇప్పుడు తిరిగి ఇవ్వాలి కదా అని మంత్రి పేర్ని చమత్కరించారు.
ఎమ్మెల్యే పేర్ని నానికి, మంత్రి పేర్ని నానికి మధ్య చాలా మార్పు ఉందని.. మంత్రి అయ్యాక చాలా మార్పు కనిపిస్తోందని పయ్యావుల కేశవ్ అన్నారు. పేర్ని నాని చాలా హుందాగా వ్యవహరించారని తమ వాళ్లతోనూ చెప్పానని పయ్యావుల అన్నారు. తన వల్ల ప్రభుత్వం ఇబ్బందుల్లో పడకూడదు కాబట్టే.. తప్పుంటే క్షమించాలని కోరినట్లు పేర్ని నాని అన్నారు.
ఇదీ చదవండి.
బుచ్చయ్య గారూ షర్ట్ బాగుంది...అవునూ నేను ఆల్వేస్ స్మార్ట్!