ప్రభుత్వంలో కీలకమైన నామినేటెడ్ పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారు. చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాను ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(ఏపీఐఐసీ) ఛైర్పర్సన్గా నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్లపాటు రోజా ఈ పదవిలో కొనసాగనున్నారు. జగన్కు తొలి నుంచీ అండగా ఉన్న రోజాకు మంత్రిపదవి దక్కుతుందని అంచనా వేశారు అంతా. కానీ సామాజిక, జిల్లాల సమీకరణతో మంత్రిపదవి దక్కలేదు.
అన్ని కీలకమైన నామినేటెడ్ పోస్టులు త్వరలోనే భర్తీచేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే పలువురు సీనియర్ ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పదవులు ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. కొన్ని చట్ట సవరణ చేయాల్సి ఉండగా... మరికొన్ని ఖాళీ కావాల్సి ఉంది. సీఆర్డీఏ ఛైర్మన్గా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని నియమించే అవకాశం ఉంది. ప్రస్తుతం సీఆర్డీఏ ఛైర్మన్గా సీఎం జగన్ ఉన్నారు. దీన్ని ఆర్కేకు ఇవ్వాలంటే సీఆర్డీఏ చట్టంలో సవరణ చేయాల్సి ఉంది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే అందుకు చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి.
మహిళా కమిషన్ ఛైర్పర్సన్గా వాసిరెడ్డి పద్మ పేరు ఖరారయిందనే ప్రచారం జరుగుతోంది. ద్వితీయ శ్రేణి నేతలు సహా... ఇటీవల ఎన్నికల్లో పోటీచేసి ఓడిన ముఖ్యనేతలకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు. ఎవరెవరికి ఏ పదవి ఇవ్వాలనే విషయమై ముఖ్యనేతలతో సమాలోచనలు జరుపుతున్నారు. అర్హతలు, స్థాయి, పార్టీకి అందించిన సేవలు, సామాజిక సమీకరణాల ఆధారంగా పదవులు ఇవ్వనున్నారు.
50 కార్పొరేషన్లు, ఫెడరేషన్ల ఛైర్మన్లు, సభ్యులను తొలగిస్తూ... ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం త్వరలో జరగనుంది. పలు నామినేటెడ్ పోస్టుల్లో ఇంకా తెదేపా నేతలే కొనసాగుతున్నారు. వీరిని తొలగించిన తరువాతే కొత్తవారికి అవకాశం ఉంటుంది. అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు వీలైనన్ని ఎక్కువ నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎక్కడా అసంతృప్తి లేకుండా... పార్టీ నేతలందరికీ న్యాయం జరిగేలా నామినేటెడ్ పదవులు భర్తీ చేయాలని జగన్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇదీ చదవండీ...