కర్ణాటక మండ్య జేడీఎస్ సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. తెలుగుబాష ఇష్టపడిన రాయలు ఏలిన నేలగా అభివర్ణించారు. మీ అందరి 'జాగ్వార్' నిఖిల్ కోసం మండ్యకు వచ్చినట్లు చంద్రబాబు చెప్పారు. బసవన్న సంఘ సంస్కరణ ఉద్యమ గాలులు తెలుగుగడ్డపై కూడా వీచాయనే విషయాన్ని గుర్తు చేశారు. ఎందరో తెలుగువాళ్లు కన్నడ సీమలో స్థిరపడ్డారు, కన్నడ సంస్కృతి, సంప్రదాయలతో మమేకమయ్యారని చంద్రబాబు అన్నారు.
ప్రధాని పదవికి వన్నె తెచ్చిన వ్యక్తి దేవెగౌడ
కావేరి నీళ్లతో తడిశాక మండ్య ప్రాంతం సస్యశ్యామలంగా మారిందని, దేవెగౌడ అనేక సాగునీటి ప్రాజెక్టులను చేపట్టి రైతుబంధుగా నిలిచారని పొగడ్తల వర్షం కురిపించారు. పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి దేవెగౌడ అని...నిరాడంబరత, దృడసంకల్పం, సమర్థ నేతగా ఆయనకు పేరుందని అన్నారు. కాంగ్రెసేతర, భాజపాయేతర ప్రధానిగా దేవెగౌడ పేరు చరిత్రలో నిలుస్తుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కర్ణాటక సీఎం కుమార స్వామిపై ప్రశంసల జల్లులు కురిపించారు. 2006లో కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీడీపీ బాగా పెరిగిందని..అందుకే ఆయనను మరోసారి సీఎం పీఠం వరించిందని చెప్పారు.
భాజపాను ఓడించండి..
కేంద్రంలో ఉన్న భాజపాను ఓడించాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. కర్ణాటక- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా ల మధ్య మంచి సంబంధాలున్నాయని, ఇరు రాష్ట్రాలను అభివృద్ధి చేసుకోవాలని ఆకాంక్షించారు. ఎన్నో ఆశలు పెట్టుకుని 2014 మోదీని గెలిపిస్తే..అందరి ఆశలపై ఆయన నీళ్లు చల్లారని మండిపడ్డారు. మన హక్కులను సాధించుకోవాలంటే అత్యధిక స్థానాల్లో ఎంపీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాను ఓడించాలని తాను పిలుపునిచ్చిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు.
నిఖిల్ను గెలిపించండి
వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించాల్సిందే..
మోదీ సూచనల మేరకు ఈసీ పని చేస్తోందని సీఎం చంద్రబాబు విమర్శించారు. వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించాలని డిమాండ్ చేశారు. ఇదే విషయంపై మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. ఓటు వేశాక వీవీ ప్యాట్ స్లిప్ ను జాగ్రత్తగా చూడాలని మండ్య ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.
మోదీ పై విమర్శల వర్షం..
మండ్య వేదికగా మోదీపై సీఎం చంద్రబాబు విమర్శల వర్షం కురిపించారు. ఏపీ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని, మోదీ అండ చూసుకునే వైకాపా వాళ్లు చెలరేగిపోయారని చంద్రబాబు విమర్శించారు. మోదీ పాలనలో నిరుద్యోగం బాగా పెరిగిందని, మహిళా భద్రత అంశంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఈ దేశాన్ని భ్రష్టు పట్టించిన వ్యక్తి మోదీ అని..మరోసారి మోదీ వస్తే దేశంలో ఎన్నికలే ఉండవని అన్నారు. సీబీఐ, ఈడీ, ఐటీలాంటి సంస్థలను మోదీ ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ రక్షణ విషయంలో మోదీ ప్రభుత్వం రాజీపడిందని, రూ.2వేల నోటు ఎందుకు తెచ్చారో మోదీ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.గుజరాత్ మోడల్ పేరుతో వచ్చిన మోదీ దేశాన్ని నాశనం చేశారని చంద్రబాబు దుయ్యబట్టారు.