
కేజ్రీవాల్ తన పరిపాలనతో దిల్లీలో అద్భుతాలు చేశారని చంద్రబాబు ప్రశంసించారు. కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ చేసిన దీక్షకు హాజరయ్యారు. ప్రధాని మోదీ ఎక్కడ డిగ్రీ చదివారో చెప్పగలరా అని ప్రశ్నించారు. మోదీ ఒత్తిడి తట్టుకోలేకే ఆర్‌బీఐ గవర్నర్ రాజీనామా చేశారని ఆరోపించారు. ఈ ఐదేళ్లలో ఆర్థిక రంగం కుదేలైందని ఆవేదన వ్యక్తం చేశారు. నోట్ల రద్దు తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నాశనమైందన్నారు. 1972 తర్వాత దేశంలో నిరుద్యోగం బాగా పెరిగిందని గుర్తుచేశారు. ప్రధాని మోదీకి కనీస పరిపాలన సూత్రాలు కూడా తెలియవని ధ్వజమెత్తారు.
మోదీ నిరంకుశ పాలన నుంచి దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని నేతలను కోరారు. మోదీ, అమిత్‌షా వైఖరిని ఖండించారు. ఎక్కడ, ఎవరికి ఇబ్బంది వచ్చినా అంతా కలిసి ఆందోళన చేశామని గుర్తుచేశారు. దేశం, ప్రజాస్వామ్య రక్షణకు ప్రజలంతా కలిసిరావాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ రోజులు లెక్కపెట్టుకోవాలని... త్వరలోనే కుర్చీ దిగుతారని జోస్యం చెప్పారు.