ఏపీకి జరిగిన అన్యాయాన్ని దేశవ్యాప్తంగా చాటిచెప్తాం ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం చేసిన అన్యాయాన్ని దేశవ్యాప్తంగా చాటిచెప్తామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. దిల్లీలో ధర్మపోరాట దీక్ష ముగింపు సందర్భంగా ప్రసంగించిన చంద్రబాబు... ప్రధాని మోదీకి గౌరవం ఇచ్చినా నిలబెట్టుకోలేక పోయారన్నారు. చేసిన తప్పును సరిదిద్దుకోవాలని హితవు చెప్పారు. ఏపీకి సంబంధించిన మొత్తం 18 డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. రేపు రాష్ట్రపతిని కలిసి రాష్ట్ర తమ డిమాండ్లను తెలియజేస్తామని అన్నారు. దేశ ప్రజలు పూర్తి మెజారిటీ ఇచ్చినా.. ప్రధాని మోదీ ఏం చేశారో చెప్పాలని సీఎం నిలదీశారు. మోదీని మించిన నటుడు దేశంలో మరొకరు లేరన్నారు. సీబీఐ, ఈడీ, సీవీసీ, ఐటీ సంస్థలను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ఎట్టిపరిస్థితుల్లో ప్రత్యేక హోదా సాధించి తీరుతామని స్పష్టం చేశారు. హక్కుల సాధనలో రాజీలేని పోరాటం చేస్తామని.. ప్రజలు ఎవరూ అధైర్య పడవద్దని చంద్రబాబు కోరారు.