భాజపా నేతల విషయలో ఒక రకంగా... ఇతర పార్టీల విషయంలో మరో రకంగా కేంద్ర ఎన్నికల సంఘం పనిచేస్తోందని ఆర్థిక మంత్రి యనమల ఆరోపించారు. ప్రధాని మోదీ, అమిత్ షాకు మద్దతుగా ఈసీ నడుచుకుంటోందన్నారు. ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ప్రస్తుత ఎన్నికల సంఘం పనితీరు భారత రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్దంగా ఉందని... రాజ్యాంగ నిర్మాతల ఆదర్శాలకు గండికొట్టేలా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.
''కేంద్ర ఎన్నికల సంఘం పక్షపాతాన్ని లావాసా వ్యాఖ్యలే బయటపెట్టాయి. మోదీ, అమిత్ షా మీద వచ్చిన ఫిర్యాదులపై క్లీన్ చిట్స్ ఇచ్చిన ఎన్నికల సంఘం... ఇతర పార్టీల నేతల మీద వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే చర్యలు చేపట్టడం వివక్షతకు నిదర్శనమే. మోదీ, షా మీద వచ్చిన ఆరోపణలపై లావాసా డిసెంట్ నోట్ ను ఎన్నికల సంఘం ఎందుకు నమోదు చేయలేదు? ఆ నోట్ లో ఏముందో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది. లావాసా వ్యాఖ్యలు ఎన్నికల సంఘం నిష్పాక్షికతనే ప్రశ్నిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు భాజపాపై సీఈసికి ఉన్న అనుకూల దృక్ఫథాన్ని వెల్లడించాయి. రాజ్యాంగబద్ధ విధి నిర్వహణకు ఎన్నికల సంఘం దూరం జరిగింది. ఆఫ్రికా దేశాల్లో ఎన్నికల సంఘం స్వతంత్రంగా పనిచేస్తోంది. మనదేశంలోనే ఈసీ అధికార పార్టీ అడుగుజాడల్లో నడుస్తోంది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 స్ఫూర్తికే విరుద్ధం.'' - యనమల రామకృష్ణుడు , ఆర్థిక మంత్రి
ఎన్నికల సంఘం భారత ప్రజాస్వామ్యానికే వెన్నెముక అని మంత్రి యనమల స్పష్టం చేశారు. ఈసీ పారదర్శకంగా ఉంటేనే.. పోలింగ్ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందన్నారు. ఈసీ ప్రక్షాళన జరగాలని... అందులో భాగంగా ఎలక్షన్ కమిషనర్లను కొలీజియం ద్వారా ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ బ్యాలెట్ల లెక్కింపు ఒకరోజులో చేస్తే, వీవీ ప్యాట్లకు 5 రోజులు ఎందుకు పడుంతుందని.. ఎన్నికల మాజీ ప్రధానాధికారి ఖురేషి ప్రశ్నించారని గుర్తుచేశారు. ముగ్గురు ఎన్నికల కమిషనర్లలో ఇద్దరే ఏ విధంగా ఎన్నికల నియమావళిని నిర్ణయిస్తారని యనమల ప్రశ్నించారు. రాజకీయ పార్టీల ప్రాబల్యంలోకి ఈసీ వెళ్లకూడదన్నారు. మోదీ, షా కు ఎన్నికల సంఘం ఇచ్చిన క్లీన్ చిట్స్ పనికిరావని చెప్పారు.