దిల్లీలోని పార్లమెంటు లైబ్రరీ భవనంలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి వైకాపా తరపున విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి.. తెదేపా తరపున గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. సమావేశ అనంతరం మీడియాతో ఎంపీలు మాట్లాడారు.
విభజన హామీలు అమలు చేయాలి: వైకాపా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే అంశాన్ని అఖిలపక్షంలో లేవనెత్తామని వైకాపా ఎంపీలు తెలిపారు. వెనుకబడిన వర్గాలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలని కోరామని వెల్లడించారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగేలా చట్టం తీసుకురావటంతో పాటు.. సమావేశాలను అడ్డుకునే వారికి జీతభత్యాలు రాకుండా చేయాలని కోరినట్లు ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు పూర్తి మద్దతునివ్వాలని, ప్రజాసమస్యలపై పార్లమెంట్ లో అర్థవంతమైన చర్చ జరగాలని చెప్పినట్లు వైకాపా ఎంపీలు తెలిపారు.
బాధ్యతాయుత ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం: తెదేపా ఎంపీ గల్లా
సభ సజావుగా జరిగేలా చూడాలని అన్ని పార్టీలు కోరాయని తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ తెలిపారు. ప్రజాతీర్పును గౌరవిస్తున్నట్లు, బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని హామీలను అమలుపై విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. సమైఖ్య స్ఫూర్తితో రాష్ట్రాలకు మేలు చేసేలా నిర్ణయాలు ఉండాలని కోరినట్లు గల్లా తెలిపారు. యూకే ప్రధాని వారానికి నిర్వహించే క్వశ్చన్ అవర్ ని మన ప్రధాని కూడా అనుసరిస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. పార్లమెంట్ సమావేశాలను ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేయాలని ప్రతిపాదించామని తెదేపా ఎంపీలు తెలిపారు.