కీలక చట్టాలను సవరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే నిర్ణయించుకున్న ప్రాధాన్యాలకు అనుగుణంగా.. శాఖల కసరత్తు దాదాపు పూర్తయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. రాష్ట్ర మంత్రివర్గం రేపు సమావేశం కానుంది. దాదాపు 12 సవరణ బిల్లులను సభ ముందుకు తేవాలని భావిస్తున్న ప్రభుత్వం.. ఈ సమావేశంలోనే వాటికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
ఇవే.. చట్ట సవరణల ప్రతిపాదనలు..
రాష్ట్రంలో లోకాయుక్త నియామకానికి సంబంధించి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని నియమించేలా తెలంగాణా తరహాలో చట్ట సవరణ చేపట్టనున్నారు. విద్యుత్ నియంత్రణ మండలి సిఫార్సుల అమలుకు సంబంధించిన అంశంలోనూ చట్ట సవరణ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. జ్యుడీషియల్ కమిషన్ నియామకం కోసం ఏపీ ఇన్ఫ్రా డెవలప్మెంట్ ఎనేబిలింగ్ చట్టం 2001 కీ సవరణ చేయనున్నారు. మౌలిక సదుపాయాల కల్పన, ఇంజినీరింగ్ ప్రాజెక్టుల్లో సమీక్ష కోసం ఈ జ్యుడీషియల్ కమిషన్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కమిషన్ ఏర్పాటు కోసం చట్ట సవరణ అవసరమని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక పాఠశాలలు, కళాశాలల్లో ఫీజు నియంత్రణకు సంబంధించి కమిషన్లను ఏర్పాటు చేసేందుకు నూతన బిల్లులను శాసనసభ ముందుంచనుంది. రాష్ట్రంలో వైద్యారోగ్యానికి సంబంధించిన సంస్కరణలు తీసుకురావాలని యోచిస్తున్న ప్రభుత్వం జిల్లా ఆస్పత్రులకు స్వయంప్రతిపత్తి కల్పించేలా సొసైటీలు, ట్రస్టు ల కిందకు తీసుకువచ్చేందుకు అవసరమైన చట్ట సవరణను తీసుకురానుంది.
హిందూ ధార్మిక చట్టానికీ...
తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్, పాలక మండలి సభ్యులను ఎప్పుడైనా రీకాల్ చేసేందుకు అవకాశం కల్పించేలా హిందూ ధార్మిక చట్టానికి సవరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశంపైనా శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టనున్నారు. రెవన్యూతో పాటు కార్మిక శాఖకు సంబంధించిన రెండు అంశాల్లోనూ చట్ట సవరణ బిల్లులను ప్రభుత్వం శాసనసభ ముందుంచనుంది.