ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల రాజధాని... ఆధునిక సాంకేతికతను వినియోగించుకొని శరవేగంగా వినూత్నంగా నిర్మితమవుతోంది. పాలనకే గుండెకాయ వంటి సచివాలయాన్ని మరింత సుందరంగా భారీగా తీర్చిదిద్దే ధ్యేయంతో తొలిసారిగా డయాగ్రిడ్ విధానంలో నిర్మిస్తున్నారు. ఒక్కొక్కటిగా డయాగ్రిడ్ కాలమ్స్‌ను అమరావతికి తరలిస్తూ బిగింపు ప్రక్రియను ప్రారంభించారు. సచివాలయ టవర్ల నిర్మాణంలో కీలక ఘట్టంగా దీన్ని సీఆర్డీఏ అభివర్ణిస్తోంది. సాధారణ పరిపాలన శాఖ, ముఖ్యమంత్రి కార్యాలయం ఉండే టవర్ల నిర్మాణాలకే దీన్ని పరిమితం చేశారు. తొలుత ర్యాఫ్ట్ ఫౌండేషన్‌తో రికార్డ్ సృషించిన సీఆర్డీఏ ఇప్పుడు ఈ భారీ కాలమ్స్‌తో మరో ఘనత సొంతం చేసుకోనుంది.
భారత్‌లోనే తొలిసారిగా డయాగ్రిడ్ విధానం
అమరావతిలో ప్రభుత్వ భవనాలు, మంత్రుల, అధికారుల భవన నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. వీటిలో ప్రధానమైనవి సచివాలయం, ముఖ్యమంత్రి కార్యాలయం సహా మొత్తం 5 టవర్లు రూపుదిద్దుకుంటున్నాయి. విభాగాధిపతులు, సాధారణ పాలన భవనాలను 4 టవర్లుగా నిర్మిస్తున్నారు. ఇక్కడ ఒక్కో టవరులో 40 అంతస్థులు ఉంటాయి. ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి కార్యాలయాల కోసం సిద్ధమవుతున్న ఇంకో టవర్‌ను 50 అంతస్థులతో తీర్చిదిద్దుతున్నారు. నిర్మిస్తున్న ఐదు టవర్లలో రెండింటికే ప్రస్తుతం భారీ డయాగ్రిడ్ కాలమ్స్ ఏర్పాటు చేస్తున్నారు. సీఆర్డీఏ అధికారులు, ప్రపంచస్థాయి నిపుణుల ఆధ్వర్యంలో పని సాగుతోంది.
ఎవరీ ఎవర్‌సెండాయ్?
స్ట్రక్చరల్ స్టీల్ ఫ్యాబ్రికేషన్‌లో ప్రపంచంలోనే అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఎవర్‌సెండాయ్ సంస్థ టవర్ల నిర్మాణ పనులు చేపట్టింది. దుబాయ్‌కు చెందిన ఈ సంస్థకు బుర్జ్ ఖలీఫా, మలేసియాలోని పెట్రోనాస్ టవర్ 2, ఖతార్‌లోని ఖలీఫా ఒలంపిక్ స్టేడియం, సింగపూర్‌లోని రిపబ్లిక్ ప్లాజా, సౌదీలోని కింగ్‌డమ్ సెంటర్ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక నిర్మాణాలు చేపట్టిన అనుభవం ఉంది.
డయాగ్రిడ్ విధానంలో నిర్మిస్తున్న ఈ టవర్లో ఒక్కో కాలమ్ బరువు 17.80 టన్నులు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ 350 బీఆర్ గ్రేడ్ అనే అత్యంత నాణ్యమైన స్టీల్‌తో తమిళనాడులో వీటిని తయారు చేసి, అక్కడి నుంచి భారీ వాహనాల్లో అమరావతికి చేర్చారు.