YCP Leaders Meeting Against Amanchi Krishna Mohan: బాపట్ల జిల్లా పర్చూరులో పలువురు వైసీపీ నేతలు అసమ్మతి గళం వినిపిస్తున్నారు. నియోజకవర్గ సమన్వయకర్త ఆమంచి కృష్ణమోహన్‌పై సొంతపార్టీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఆమంచికి వ్యతిరేకంగా పలువురు నేతలు సమావేశం నిర్వహించడం ప్రస్తుతం నియోజకర్గంలో హాట్ టాపిక్‌గా మారింది.
బాపట్ల జిల్లా పర్చూరు వైసీపీ సమన్వయకర్త ఆమంచి కృష్ణమోహన్‌పై అసమ్మతిగళం వినిపిస్తున్న ఆ పార్టీ నాయకులు.. ఈమేరకు సమావేశం ఏర్పాటుచేసుకున్నారు.. ప్రశాంతంగా ఉండే పర్చూరు నియోజకవర్గంలో ఆమంచి ఇంఛార్జ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అక్రమదందాలు, అరాచకాలు పెరిగిపోయాయన్నారు. సొంత పార్టీ నాయకులనే ఆమంచి ఇష్టమొచ్చినట్లు దూషిస్తున్నారని అసమ్మతి శ్రేణులు ఆవేదన వ్యక్తం చేశారు.
వైసీపీ అధిష్ఠానం ఈ విషయంలో జోక్యం చేసుకోకపోతే తమ సత్తా చూపుతామని స్పష్టం చేశారు. ఆమంచి తీరును నిరసిస్తూ చినగంజాం మండలానికి చెందిన పలువురు నాయకులు పెదగంజాంలో సమావేశమయ్యారు. చినగంజాం ఎంపీపీ అంకమ్మరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మండలం నుంచి సుమారు 250 మంది నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.
మొదటి నుంచి పార్టీలోనే ఉంటూ వైసీపీ బలోపేతానికి కృషి చేస్తున్న నేతలంటే పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్‌కు గౌరవం లేదని.. ఎంతటి నాయకులనైనా దుర్భాషలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంటెద్దుపోకడతో నియోజకవర్గంలో అరాచకాలు చేస్తున్నాడని అసమ్మతి నేతలు ఆరోపించారు 'ఆమంచి వద్దే వద్దని చెప్పిన నేతలు.. త్వరలో మండలంలోని అన్ని గ్రామాల్లో పర్యటిస్తామని చెప్పారు. చీరాలకు చెందిన ఆమంచి అనుచరులు వైసీపీ సర్పంచ్‌ను సైతం మామూళ్లు ఇవ్వాలని పట్టుబడుతున్నారన్నారు.
రొయ్యల చెరువుల యజమానులను బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని సమావేశంలో అంకమ్మరెడ్డి ఆరోపించారు. ఇదే పరిస్థితి కొనసాగితే.. త్వరలో నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలతో భారీ స్థాయిలో సమావేశం ఏర్పాటు చేసి వైసీపీ అధిష్ఠానానికి తమ నిరసన గళం వినిపిస్తామని చినగంజాం ఎంపీపీ అంకమ్మరెడ్డి హెచ్చరించారు.
అయితే ఆమంచిపై విమర్శలు రావడం ఇదేమీ మొదటి సారి కాదు. గతంలో సైతం పలువురు నేతల బహిరంగంగానే ఆమంచిని హెచ్చరించిన సందర్భాలూ ఉన్నాయి. చీరాల వైసీపీ ఇంఛార్జ్ కరణం వెంకటేశ్ సైతం గతంలో ఆమంచి సోదరులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చెంపలు పగలకొడతానంటూ మండిపడ్డారు.
అంతే కాకుండా గతంలో చీరాలలో చీరాల ఎమ్మెల్యే కరణం బలరామ కృష్ణమూర్తి ఆమంచి కృష్ణమోహన్ వర్గీయులు మధ్య ఘర్షణలు సైతం చోటుచేసుకున్నాయి. ఈ దాడిలో పలువురికి గాయాలు సైతం అయ్యాయి. విభేదాలను పరిష్కరించేందుకు వైసీపీ ప్రాంతీయ సమన్వయ కర్త విజయసాయి రెడ్డి రంగంలోకి దిగినా పిరిస్థితిలో మార్పు రాలేదు. కొద్ది రోజులు అంతా సవ్యంగానే అనిపించినా.. తాజాగా మరోసారి ఆమంచికి సొంత పార్టీ నేతల నుంచి అసమ్మతి ఎక్కువ అవుతోంది.