Sankranti Celebrations in Repalle: సంక్రాంతి పండగ వచ్చిందంటే సంబరాలకు అడ్డూ అదుపు ఉండదు. ఈ పండగలో యువతులు ముగ్గుల పోటీలు.. యువకుల భోగి మంటలు, కోడి పందాల్లో పాల్గొనడం అందరికీ తెలిసిన విషయమే.. అయితే కోడి పందాల నిర్వాహణపై ప్రభుత్వం నిఘా పెట్టడమే కాకుండా.. ప్రభుత్వ నిషేధిత ఆటలు ఆడేవారిని అదుపులోకి తీసుకుంటున్న ఘటనలు గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం. కానీ బాపట్ల జిల్లా రేపల్లెలో అందుకు భిన్నంగా ట్రాక్టర్ రివర్స్ పందాలను నిర్వహించారు.
బాపట్ల జిల్లా రేపల్లెలో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. పట్టణ శివారులో ట్రాక్టర్ రివర్స్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లిఖార్జున రావు, రాష్ట్ర సర్పంచుల సంక్షేమ సంఘం అధ్యక్షులు చిలకలపూడి పాపారావు ప్రారంభించారు. పోటీల్లో పాల్గొనేందుకు దూర ప్రాంతాల నుంచి పోటీదారులు వచ్చారు. మరో వైపు దక్షిణాది రాష్ట్రాల నుంచి పోటీలకు తీసుకొచ్చిన గొర్రె పొట్టేళ్లను ప్రదర్శనకు ఉంచారు. ఆంధ్ర, తెలంగాణ, బెంగుళూరు, తమిళనాడు నుంచి తీసుకొచ్చిన కురపు జాతి, నాటు జాతిలో పలు రకాల పోటేళ్లను స్థానికులు ఆసక్తిగా తిలకించారు. పండుగ సందర్భంగా సాంప్రదాయ కార్యక్రమాలు, వివిధ రకాల పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పోటీల్లో విజయం సాధించిన వారికి బహుమతులు అందజేయనున్నట్లు వెల్లడించారు.
సంక్రాంతి సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో గతంలో వివిధ క్రీడలు నిర్వహించేవారు. ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ మా ప్రాంతంలో సైతం వివిధ రకాలైన గొర్రె పొట్టేళ్లతో పోటీలు నిర్వహిస్తున్నాం. వీటిని హైదరాబాద్, బెంగుళూరు, తమిళనాడు లాంటి ప్రదేశాలనుంచి తీసుకువస్తారు. ఈ పోటీల్లో గెలిచిన వారికి బహుమతులుల సైతం ఇవ్వడం జరుగుతుంది. ఈ సారి ప్రత్యేకంగా రైతు సోదరుల కోసం ట్రాక్టర్ రివర్స్ పోటీలను నిర్వహిస్తున్నాం. -దేవినేని మల్లికార్జున రావు, మాజీ ఎమ్మెల్యే
ఈ పోటీల్లో పాల్గొనడానికి మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. ఒక్కో పొట్టేలు ధర రూ.3 నుంచి రూ.5 లక్షల వరకు ఉంటుంది. ఇలాంటి పొట్టేలు జాతి ఎక్కవగా కర్ణాటకలోని కనిపిస్తోంది. మేము సైతం వీటిని మెుదట అక్కడి నుంచే తీసుకువచ్చాం. కేవలం వీటిని సరదా కోసం మాత్రమే పెంచుకుంటున్నాం. వీటి రోజువారి ఆహారంలో బాదం, పిస్తా, కిస్మిస్లు పెడతాం. రాంపుర్ జాతి, కర్ణాటక జాతి... ఇంకా అనేక రకాలైన జాతులు ఉంటాయి. కర్ణాటకలో రోజు ఈ గొర్రె పొట్టేళ్ల పోటీలు నిర్వహిస్తారు. మేము అక్కడ సైతం పోటీల్లో పాల్గొంటాం. -పొటేలు యజమాని
ఇవీ చదవండి: