Road Accident in Bapatla District: బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో అద్దంకి ఎస్సైగా పనిచేస్తున్న సమందరవలి కుటుంబ సభ్యులు, వారి బంధువులు, డ్రైవర్‌తో సహా అయిదుగురు దుర్మరణం పాలయ్యారు. బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం మేదరమెట్ల వద్ద శ్రీ బ్రమరా టౌన్ షిప్ ఎదురుగా ప్రమాదం చోటు చేసుకుంది. ఎస్సై కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారు జిల్లాలోని చినగంజాం నుంచి అద్దంకి వస్తుండగా ప్రమాదం సంభవించినట్లు తెలుస్తుంది.
అద్దంకి వైపు వెళ్తున్న కారు డివైడర్‌పై నుంచి ఒంగోలు వెళ్లే మార్గం వైపుకు వచ్చింది. దీంతో అదే సమయంలో రహదారిపై ఒంగోలు వైపు వెళ్తున్న లారీ.. కారుపైకి ఎక్కటంతో కారు నుజ్జు నుజ్జు అయింది. ఈ కారణంగానే కారులో ప్రయాణిస్తున్న ఎస్సై భార్య, కుమార్తె, వారి బంధువులు, డ్రైవర్‌తో సహా అయిదుగురు దుర్మరణం పాలయ్యారు.
Road Accident in Eluru District: ఏలూరు జిల్లా భీమడోలు మండలం పూళ్ల వద్ద శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. కురెళ్లగూడెం గ్రామానికి చెందిన దండ్రు వీరస్వామి, కర్నాటి మహేంద్ర, ఊటుకూరు ఫణీంద్ర, గండికోట శ్రీనులు.. ఉంగుటూరు మండలం కైకరం నుంచి రెండు ద్విచక్ర వాహనాలపై స్వగ్రామం బయలుదేరారు.
పూళ్ల వద్ద రహదారి పక్కగా ద్విచక్ర వాహనాలు నిలిపారు. ఈ క్రమంలో భీమవరం నుంచి చింతలపూడి వెళ్లే.. ఆర్టీసీ బస్సు రెండు ద్విచక్ర వాహనాలను ఢీ కొట్టింది. తరువాత సుమారు 100 మీటర్లు మేర ఈడ్చుకువెళ్లింది. ఈ ప్రమాదంలో వీరస్వామి, మహేంద్ర అక్కడికక్కడే మృతి చెందగా ఫణీంద్రని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందారు.
గండికోట శ్రీను పరిస్థితి కూడా విషమంగా ఉంది. తమకు న్యాయం చేయాలంటూ బాధితుల కుటుంబ సభ్యులు రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సుమారు రెండు గంటల తర్వాత.. న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
Road Accident in Eluru District: ఏలూరు జిల్లా పోలవరం మండలం పట్టిసం క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాల్లో విషాదం చోటుచేసుకుంది. స్నానం చేయడం కోసం గోదావరి నదిలో దిగిన ఏడుగురు యువకుల్లో.. ముగ్గురు యువకులు గల్లంతవగా.. మరో నలుగురు యువకులు సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన యువకులది తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం దోసకాయలపల్లి గ్రామంగా పోలీసులు గుర్తించారు.
పట్టిసం క్షేత్రానికి ఓ వైపు తూర్పుగోదావరి.. మరో వైపు ఏలూరు జిల్లా.. రెండువైపులా భక్తులు సురక్షితంగా స్నానాలు చేసేందుకు బ్యారికేడ్లు ఏర్పాటు చేసినా.. ఈ యువకులు బ్యారికేడ్లకు దూరంగా గోదావరిలో స్నానానికి దిగి ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. గల్లంతైన యువకుల్లో రాంప్రసాద్, షేక్ లుక్మాన్ మృతదేహాలు లభ్యం కాగా మరో యువకుని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Chittoor District: చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం గుడిసెబండ వద్ద నిప్పంటుకుని స్కూటర్‌తో సహా ఓ వ్యక్తి సజీవ దహనమైన ఘటన చోటు చేసుకుంది. పలమనేరుకు చెందిన యువకుడు మదనపల్లెకు వెళ్తుండగా ట్రక్ ఢీ కొనడంతో స్కూటర్లో మంటలు వ్యాపించాయి. ఒక్క సారిగా మంటలు వ్యాపించడంతో అక్కడికక్కడే స్కూటర్‌తో సహ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. దీంతో చుట్టుపక్కలవారు పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Alluri Sitharama Raju District: అల్లూరి జిల్లా అనంతగిరి మండలం లొంగుపర్తి పంచాయతీ రాయపాడు వద్ద బైక్ ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. బొర్రా గుహల్లో జరిగిన శివరాత్రి వేడుకలను తిలకించి స్వగ్రామం బోర్జకి తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో.. బైకు లోయలోకి వెళ్లిపోవడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే చనిపోయారు.
ఇవీ చదవండి: