Attack On Electricity Officials: బాపట్ల జిల్లా అద్దంకి మండలం కలవకూరు గ్రామంలో విద్యుత్ అధికారులపై దాడి చేసిన సంఘటన బుధవారం ఉదయం సమయంలో చోటు చేసుకుంది. విద్యుత్ అధికారులు డివిజనల్ రైడింగ్ పేరిట గ్రామాల్లో పర్యటించి తనిఖీలు నిర్వహిస్తారు. దానిలో భాగంగా బుధవారం రోజున కలవకూరు గ్రామానికి కొమ్మాలపాడు లైన్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, తమ సిబ్బందితో కలసి గ్రామంలో తనిఖీలు చేస్తున్నారు. గ్రామ ఉప సర్పంచ్ ఆదిరెడ్డి ఇంటికి తనిఖికి వెళ్లారు. ఆదిరెడ్డి ఇంట్లో తనిఖీలు ముగించుకొని పక్క ఇంటికి వెళ్లగా అక్కడ తాళం వేసి ఉండటంతో ఆదిరెడ్డి కలగజేసుకొని లైన్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లుపై దుర్భాషలాడాడు.
విద్యుత్ సిబ్బంది, ఆదిరెడ్డి ఒకరినొకరు దూషించుకున్నారు. కోపోద్రిక్తుడైన ఆదిరెడ్డి అందుబాటులో ఉన్న కర్రను తీసుకొని వెంకటేశ్వర్లుపై దాడి చేశాడు. లైన్ ఇన్స్పెక్టర్వెంకటేశ్వర్లు జరిగిన విషయాన్ని పై అధికారులకు తెలిపి అద్దంకి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.