Daggubati Venkateswara Rao comments on Jagan: భగవంతుడి దయ వల్ల వైసీపీ నుంచి తాను ఓడిపోవడం మంచిదయిందని దగ్గుబాటి దగ్గుబాటి వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. బాపట్ల జిల్లా కారంచేడులో దగ్గుబాటి వెంకటేశ్వరరావు (Daggubati Venkateswara Rao) గ్రామస్థులతో మాటామంతిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భగవంతుడి దయవల్ల పర్చూరు నియోజకవర్గంలో తాను ఓడిపోవడం మంచిదయిందని వెల్లడించారు. తాను ఓడిపోయిన రెండు నెలల తర్వాత జగన్ పిలిపించి తన కుమారుడికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తానని చెప్పారన్నారు. అయితే, జగన్మోహన్ రెడ్డి పెట్టిన నిబంధనలకు మనం ఇమడలేం అనుకుని, రాజకీయాలు వద్దు అని సున్నితంగా తిరస్కరించినట్లు దగ్గుబాటి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.
రాజకీయాలంటే నేడు బూతులు తిట్టుకోవటంలా మారిపోయాయని తెలిపారు. దానికి ఎదురు జవాబులు ఇచ్చుకోవడమే తప్ప ఒరిగిందేమీ లేదని దగ్గుబాటి పేర్కొన్నారు. బీజేపీ అధికారంలో లేనప్పుడే పురందేశ్వరి ఆ పార్టీలో చేరారని దగ్గుబాటి తెలిపారు. కారంచేడులో రోడ్లు వేయలేదు అంటున్నారు, ఆరోజు నన్ను గెలిపించినట్లయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రోడ్ల మీద ఇంత స్వేచ్ఛగా తిరగగలిగే వాడినా అంటూ ఎద్దేవా చేశారు.
ఘనంగా వాజపేయి జయంతి వేడుకలు: బాపట్ల కారంచేడు వంతెన సెంటర్‌లో ఘనంగా వాజ్పేయి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొన్నారు. అనంతరం రూ.90 లక్షలతో తలపెట్టిన నీటిశుద్ధి పనులకు పురందేశ్వరి భూమిపూజ చేశారు. ఓఎన్‌జీసీ సామాజిక బాధ్యత పథకంలో భాగంగా నిధులు కేటాయించింది. కేంద్రమంత్రితో మాట్లాడిన పురందేశ్వరి, కారంచేడుకు ఈ నిధులు మంజూరు చేయించారు. అనంతరం దగ్గుబాటి దంపతులతో కారంచేడు గ్రామస్థుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
కారంచేడు రోడ్డు దుస్థితి: దగ్గుబాటి వెంకటేశ్వరరావు వ్యాఖ్యలు వైసీపీ ప్రభుత్వంలో రోడ్ల పరిస్థితులు ఏవిధంగా ఉన్నాయో తెలుస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు. గత కొంత కాలంగా కారంచేడు రోడ్డు మరమ్మతుల కోసం ఆ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఆ వైపుగా అడుగులు వేయకపోవడం, తాజాగా దగ్గుబాటి వ్యాఖ్యలు కారంచేడులో రోడ్ల దుస్థితి ఏవిధంగా ఉందో తెలుస్తుంది.