Crops are Drying up Due to Lack of Irrigation Water: కళ్ల ముందే ఎండుతున్న పంటలను చూసిన రైతు తట్టుకోలేకపోతున్నాడు.. నాట్లు వేశామని ఆనందపడిన రైతులు సాగునీరు లేక ఎండుతున్న పంటలను చూసి రైతులు బావురుమంటున్నారు. సకాలంలో వర్షాలు పడతాయి.. కాలువలో సాగునీటికి ఇబ్బంది ఉండదని పంటలు వేసిన అన్నదాతల ఆశలు ఆవిరయ్యాయి. బాపట్ల జిల్లాలో కొమ్మమూరు కాలువ కింద 3.18 లక్షల ఎకరాలు ఉండగా ఇప్పటివరకు సాగైన మాగాణి 2.8 లక్షల ఎకరాలు మాత్రమే కొమ్మమూరు కాలువలో నీటిసరఫరా నిలిచిపోవటంతో ఏ మేరకు పంట చేతికొస్తుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
కారంచేడు, స్వర్ణ, కుంకలమర్రు, పోతుకట్ల, వేటపాలెం, చినగంజాం ప్రాంతాల్లో సుమారు లక్ష ఎకరాల్లో వరి సాగవుతుంది. ఆ ప్రాంతాల్లోని వరి సాగుచేసిన రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. కళ్లముందే బీటలువారి ఎండుతున్న పంటలను కాపాడుకోవడానికి అన్నదాతలు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కాలువలో ఉన్న అరకొర నీటిని ఆయిల్ ఇంజన్లతో తోడి పంటలను కాపాడుకోవటానికి అష్టకష్టాలు పడుతున్నారు. పొలంలో చుక్కనీరు లేక భూమి నెర్రెలు ఇచ్చి.. ఎండిపోతు చూసి రైతు ఆవేదన చెందుతున్నాడు. ఉన్న కొద్దిపాటి నీటిని తొడటానికి రోజుకు ఆయిల్, ఇంజను అద్దె కలిపి రోజుకు 2 వేల రూపాయలు అదనంగా ఖర్చవుతుందని, ఇప్పటికే ఎకరాకు రూ. 22 వేలు ఖర్చు చేశామని వాపోతున్నారు.
జనవరి వరకు సాగునీరు (Irrigation Water) అందితే పంటలు చేతికొస్తాయని లేకపోతే..పెట్టిన పెటుబడులు బూడిదలో పోయిన పన్నీరు అన్న చందంగా మారుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాట్లు వేసి వెద పెట్టిన పొలంలో సకాలంలో నీరు అందక నెర్రెలిచ్చి పైరు ఎండిపోతుందని.. కొమ్మమూరు కాలువలో నీటి పరిమాణం 8 అడుగులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 3 అడుగులు కుడాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగుచేసిన భూముల్లో వరి పంటను కాపాడుకునేందుకు ఆయిల్ ఇంజన్లతో నీటిని పెట్టుకుంటున్నామని రైతన్నలు వాపోతున్నారు.
ఇది అదనపు ఖర్చుతో కూడుకున్న పనైనా సరే పంటను కాపాడుకునేందుకు నానా అవస్థలు పడుతున్నామని అంటున్నారు. గత టీడీపీ ప్రభుత్వం కొమ్మమూరు కాలువకు పట్టిసీమ నుంచి నీటిని మళ్లించటం వల్ల పంటకు సాగునీరుతో ఎంలాంటి ఇబ్బంది వచ్చేది కాదని అనుకున్న దానికంటే అధిక దిగుబడులు వచ్చేవని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పట్టిసీమ (Pattiseema Lift Irrigation Project) నుంచి నీళ్లు అందిస్తే తాము ఎలాంటి ఇబ్బంది లేకుండా వ్యవసాయం చేసుకుంటామని లేకపోతే ఆత్మహత్యలే శరణ్యమంటుని కారంచేడు ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.